ఆర్టీసీ బస్సులో భారీగా పేలుడు పదార్థాలు..

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సిటీలో పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం రేపింది. నరసరావుపేట నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి..
ఓ ప్రయాణికుడి అప్రమత్తతతో విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్ అలీ అనే ప్రయాణికుడు నరసరావుపేట నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణించారు. బస్సు దిగిన తర్వాత ఆయన పొరపాటున తనది కాని వేరే బ్యాగును తీసుకున్నారు.

కొంత సమయం తర్వాత ఆ బ్యాగును తెరిచి చూడగా అందులో పేలుడు పదార్థాలు ఉండటాన్ని గమనించి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే సమీపంలోని బస్టాండ్ పోలీస్ అవుట్ పోస్టుకు వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ బ్యాగును స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. అందులో 46 జిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను రప్పించి బస్సుతోపాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు…

తారుమారైన లగేజ్ బ్యాగ్..??

విజయవాడలో పేలుడు పదార్థాల రవాణా వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. నరసరావుపేట నుంచి విజయవాడ వస్తున్న ఒక ప్రయాణికుడి బ్యాగ్‌లో ఏకంగా 46 జిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు లభ్యమయ్యాయి. సోమవారం రాత్రి పదకొండున్నర గంటల తర్వాత కృష్ణలంక పోలీసు స్టేషన్ పరిధిలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ పోలీస్ అవుట్ పోస్టును ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆఫ్రిక్ ఆలి ఆశ్రయించాడు. నరసరావుపేట నుంచి బస్సులో విజయవాడకు వచ్చానని, దిగి చూసేసరికి తన లగేజీ బ్యాగ్ మరొక ప్రయాణికుడి బ్యాగ్‌తో పొరపాటున మారిపోయినట్లు గుర్తించానని చెప్పాడు. కంగారుపడి అసలు ఆ బ్యాగ్‌లో ఏముందనే కుతూహలంతో, ఆందోళనతో తెరిచి చూశానని, ఆ బ్యాగ్‌ను పరిశీలించగా అందులో ప్రాణాంతకమైన పేలుడు పదార్థాలు కనిపించడంతో వెంటనే అప్రమత్తమై అవుట్ పోస్టులోని పోలీసులకు సమాచారం అందించినట్లు ఫిర్యాదుదారుడు తెలిపారు.

కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గిరిధర్ బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఆ బ్యాగ్ అసలు ఎవరిది? భారీ పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణాలలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. నరసరావుపేట నుంచి విజయవాడ వరకు బస్సులో ప్రయాణించిన ప్రయాణికుల వివరాలను సేకరిస్తున్నారు. బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు, మార్గమధ్యంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు…