అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు విశ్వాస్ కుమార్ రమేశ్. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు, విమాన ప్రమాదం గురించి మీడియాతో మాట్లాడాడు. ఎలా బతికానో తనకే అర్థం కాలేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తనతో మాట్లాడరని, ఘటన గురించి అడిగారని తెలిపాడు.
MODI MET AHMADABAD PLANE SURVIVOR
“విమానం కూలగానే నేను కూర్చున్న సీటు హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్లో పడింది. నేనేం దూకలేదు. నా సీటు ఊడడం వల్ల దూరంగా ఎగిరిపడ్డా. అప్పుడు బయటకు వచ్చేందుకు ప్రయత్నించా. ఎదురుగా ఒక భవనం గోడ కనిపించింది. దాని పక్క నుంచి బయటకు వచ్చా. నేను ఎలా బతికానో నాకు తెలియదు. మంటలు చెలరేగినప్పుడు నా ఎడమ చేయి కాలిపోయింది. ఆ తర్వాత నన్ను ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు నన్ను బాగా చూసుకుంటున్నారు” అని తెలిపాడు.
“విమానం కూలిన ఘటన గురించి ప్రధాని మోదీ నన్ను అడిగారు. అదంతా నా కళ్ల ముందే జరిగింది. నేను ఎలా ప్రాణాలతో బయటపడ్డానని నమ్మలేకపోయాను. నేను కూడా చనిపోయానని అనుకున్నాను. కానీ నేను కళ్లు తెరిచేసరికి శిథిలాల మధ్య ఉన్నా. చుట్టూ మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. భయంతో అక్కడి నుంచి మెల్లగా బయటకు వచ్చాను” అని చెప్పాడు..