రాష్ట్రంలో సంచలనం దృష్టించిన చెక్కపెట్టెలో మృతదేహం పార్శిల్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రేవతి, వర్మ, సుష్మ పాత్ర ఉందని తెలింది. పశ్చిమగోదావరి జిల్లా యండగండి గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ మీడియాకు వెల్లడించారు. “జిల్లాలో పార్శిల్లో మృతదేహం కేసు దర్యాప్తు పూర్తయింది. ఈ కేసులో రేవతి, వర్మ, సుష్మ పాత్ర ఉంది. రంగరాజు కుమార్తెలు తులసి, రేవతి మధ్య గొడవలు ఉన్నాయి. రేవతికి 2016లో శ్రీధర్ వర్మతో పెళ్లి జరిగింది. తులసిని భర్త వదిలేయడంతో తండ్రి ఇంటికి వచ్చి ఉంటుంది. రంగరాజుకు 2.50 ఎకరాల పొలం, కొంత స్థలం, బంగారం ఉన్నాయి. మరో మహిళ సుష్మకి ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగాయి. శ్రీధర్ వర్మతో సుష్మకు ఫేస్బుక్ పరిచయమైంది. ప్రస్తుతం ఇద్దరు కలిసే ఉంటున్నారు. వర్మకు, సుష్మకు ఇద్దరికీ మూడేసి పెళ్లిళ్లు జరిగాయి” అని ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు.”పర్లయ్యను భార్య వదిలేసింది. కుటుంబసభ్యులున్నా పర్లయ్యను పట్టించుకునే వారు లేరు. అందుకే పర్లయ్యను శ్రీధర్ వర్మ తన పథకానికి వాడుకున్నాడు. మృతదేహం వచ్చిన రోజు వర్మ అక్కణ్నుంచి వెళ్లిపోయారు. తులసి నుంచి డబ్బులు వసూలు చేయాలని పన్నాగం పన్నారు. ఆ డబ్బులను రేవతి, వర్మ, సుష్మ పంచుకోవాలని చూశారు. డబ్బులు వచ్చాక శవాన్ని సముద్రంలో పడేస్తామని కుటుంబసభ్యులను నమ్మించాడు. చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ కుట్రకు పన్నాగం పన్నారు. పోలీసులనే విస్తుపరిచేలా ఈ ఘటన ఉంది. పర్లయ్యను సుష్మకి ఉన్న పొలంలోనే హత్య చేశారు. తాగి ఉన్న సమయంలో నైలాన్ తాడుతో కట్టి చంపారు. పర్లయ్యకు ముందు మరో వ్యక్తిని చంపాలని వర్మ ప్లాన్ చేశాడు. వర్మ చేపల చెరువుల చేయడం ద్వారా ఆదాయం సంపాదిస్తున్నారు. జూన్ నుంచి ఈ కేసుకు కుట్ర పన్నారు” అని ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు.
అసలేం జరిగిందంటే?..నైలాన్ తాడు మెడకు బిగించి హత్య .. తన వదిన తులసిని బెదిరించి ఆస్తి కాజేసేందుకు శ్రీధర్‌వర్మ, అతడి రెండో భార్య రేవతి (తులసి చెల్లెలు), వర్మ ప్రియురాలు సుష్మ కలిసి పర్లయ్యను హత్య చేసినట్లు తేలింది. ఈ విషయాన్ని వారు పోలీసుల వద్ద అంగీకరించినట్లు సమాచారం. శవాన్ని ఇంటికి పంపడం ద్వారా తులసిని భయపెట్టాలని చూశారు. దీనికోసం ఎక్కడైనా శవం దొరుకుతుందేమోనని వెతికారు. ఎక్కడా దొరక్కపోవడంతో ఒంటరిగా ఉంటున్న పర్లయ్యను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. పర్లయ్య సొంత గ్రామమైన కాళ్ల గ్రామం గాంధీనగరంలోనే నిందితుడు శ్రీధర్‌వర్మ కూడా ఉంటున్నారు. అతడికి మద్యం తాగించి మత్తులో ఉండగా కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నైలాన్ తాడు మెడకు బిగించి హత్య చేసినట్లు సమాచారం..
చాకచక్యంగా వ్యవహరించిన తులసి..: పర్లయ్య మృతదేహాన్ని గాంధీనగర్‌లో ఇంట్లోని చెక్కపెట్టేలో పెట్టారు. మరుసటి రోజు ఆటోలో యండగండిలోని తులసి ఇంటికి శవాన్ని పార్సిల్ చేశారు. చెక్కపెట్టే తెరిచి అందులోని శవాన్ని చూసి తీవ్ర ఆందోళనకు గురైన తులసితో శవం విషయం బయటకు పొక్కకుండా చూసుకుంటానని అందుకు ఆమెను ఆస్తి పత్రాలపై సంతకాలు చేయాలని అడిగారు. సంతకం చేయాలని తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారు. సంతకం పెడతావా లేదా నువ్వూ శవమవుతావా? అని ఆమెను బెదిరించారని, తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ లాగేసుకున్నారని అంటున్నారు. దీంతో వాళ్ల నుంచి తప్పంచుకోడానికి మూత్రశాలకని వెళ్లాలి అని చెప్పి వెళ్లింది. చాకచక్యంగా తన దగ్గర ఉన్న మరో ఫోన్‌తో తెలిసిన వారికి సంక్షిప్త సమాచారం అందించింది. ఆమె సమాచారంలో కొంతమంది ఇంటికి చేరుకుని ఏం జరిగిందని ఆరా తీస్తూ, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శ్రీధర్ వర్మ అక్కడి నుంచి పారిపోయాడు…
40 సిమ్ కార్డులు మార్చిన నిందితుడు : శ్రీధర్ వర్మ తన ప్రియురాలు సుష్మ, తన కుమార్తెతో కలిసి కారులో కృష్ణా జిల్లా బంటుమిల్లి మీదుగా మంగినపూడి బీచ్ చేరుకున్నారు. అక్కడ తాళ్లపాలెంలో కారు వదిలేసి లాడ్జిలో ఒకరోజు బస చేసినట్లు సమాచారం. తర్వాత సమీప గ్రామంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. మీ మొత్తం వ్యవహారంలో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు నిందితుడు శ్రీధర్ వర్మ 40కి పైగా సిమ్ కార్డులు ఉపయోగించారు. నిందితుడి బ్యాంకు ఖాతాలో సుమారు రూ.2 కోట్లు ఉన్నాయని తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు..