ప్రపంచానికి మరో యుద్ధ ముప్పు…ఇరాన్‌పైనా దాడులు చేసేందుకు ఇజ్రాయెల్‌ సిద్ధం…!

పశ్చిమాసియా నుంచి బలగాలను ఖాళీ చేయిస్తున్న ట్రంప్‌

ఇప్పటికే రెండు యుద్ధాలతో అతలాకుతలమవుతున్న ప్రపంచానికి మరో యుద్ధ ముప్పు ముంచుకొస్తోంది….

పశ్చిమాసియాలోనే ఈ యుద్ధ మేఘం కమ్ముకుంటోంది. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌.. ఇరాన్‌పైనా దాడులు చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ దేశంలోని అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తోంది. ఈ విషయంలో అమెరికా మాటను వినేందుకూ ఇజ్రాయెల్‌ సిద్ధంగా లేకపోవడం గమనార్హం. మరోవైపు దీనిని తిప్పికొట్టేందుకు ఇరాన్‌ అదే స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటోంది. వందల బాలిస్టిక్‌ క్షిపణులను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఎటు దారితీస్తుందోనన్న భయాందోళనలు ప్రపంచమంతటా వ్యక్తమవుతున్నాయి.

వాషింగ్టన్, టెల్‌ అవీవ్, టెహ్రాన్‌: పశ్చిమాసియాలో మరో యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. తమ వ్యతిరేక శక్తులకు సహకారం అందిస్తుందనే కోపంతో ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయడానికి ఇజ్రాయెల్‌ సన్నాహాలు చేసుకుంటోంది. ఆదివారం అమెరికాతో ఇరాన్‌ చర్చల తర్వాత ఈ దాడులు జరిగే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్‌ దాడులు చేస్తే ప్రతి దాడులకు ఇరాన్‌ సిద్ధమవుతోంది. ఆ దేశంపై వందల డ్రోన్లను ప్రయోగించడంతోపాటు పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు చేయాలని భావిస్తోంది. దీంతో పశ్చిమాసియాలోని స్థావరాల్లో ఉన్న సైనికులను ఖాళీ చేయించడంతోపాటు రాయబార కార్యాలయాల సిబ్బందిని తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలిచ్చారు.

కొద్ది రోజుల్లోనే..

ఇరాన్‌పై కొద్ది రోజుల్లోనే దాడులు చేస్తామని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. అమెరికా సాయం లేకుండానే ఈ దాడులు జరగనున్నాయి. ఆదివారం అమెరికా, ఇరాన్‌ మధ్య అణు చర్చలు పూర్తయ్యాక ఈ దాడులు జరిగే అవకాశముందని అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ దిశగా ఇజ్రాయెల్‌ సన్నాహాలు చేస్తోందని వివరించారు. ఇరాన్‌తో అమెరికా ఒప్పందం చేసుకోవడంపై ఇజ్రాయెల్‌ ప్రధాని విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌ దాడులపై తమ మిత్ర దేశం తమను హెచ్చరించిందని ఇరాన్‌ అధికారి ఒకరు గురువారం తెలిపారు. ఈ ఉద్రిక్తతలు తమ అణు హక్కుల విషయంలో మార్పులకు కారణం కాబోతున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అణు శుద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని అమెరికాకు ఇరాన్‌ తేల్చి చెప్పబోతున్నట్లు సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిగా అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్‌ రక్షణ మంత్రి అజీజ్‌ నజీర్జాదే బుధవారం తెలిపారు. దీంతోపాటు ఇజ్రాయెల్‌పై వందల బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తామని స్పష్టంచేశారు.

అమెరికా అప్రమత్తం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా నుంచి తమ సైనిక, ఇతర సిబ్బందిని తగ్గించుకోవాలని నిర్ణయించారు. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని సిబ్బందిని తగ్గించాలని సూచించారు. బహ్రెయిన్, కువైట్‌లలోనూ అత్యవసరం కాని సిబ్బందిని తగ్గించాలని ఆదేశించారు. వారంతా ఆయా దేశాలను వీడేందుకు సాయం చేస్తామని ప్రకటించారు. ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందికీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో ఏదో జరగబోతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అంశంపై మాట్లాడిన ట్రంప్‌.. ఊహాగానాలకు బలాన్ని చేకూర్చేలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇరాన్‌తో అణు చర్చలు విఫలమైతే దాడులు చేస్తామని ఇప్పటికే ఆయన హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఇరాన్‌తో చర్చల్లో పురోగతి కనిపిస్తుందన్న ఆశలు కరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. వారు ఆలస్యం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ‘అది ప్రమాదకరమైన ప్రాంతం. మా సైనిక కుటుంబాలను, దౌత్య సిబ్బందిని అక్కడి నుంచి తరలిస్తున్నాం. ఆ ప్రాంతాన్ని వీడాలని వారికి నోటీసులు జారీ చేశాం. ఏం జరుగుతుందో చూడాలి’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరాన్‌పై దాడి జరుగుతుందని చెప్పలేమని, అదే సమయంలో జరగొచ్చు కూడా అని గురువారం మరోసారి వ్యాఖ్యానించారు. ఇరాన్‌ ఒప్పందానికి అంగీకరించకపోతే చోటుచేసుకునే భారీ ఘర్షణపట్ల ఆందోళనగా ఉన్నానని పేర్కొన్నారు..

ఇరాన్‌కు వ్యతిరేకంగా ఐఏఈఏ తీర్మానం.. వ్యతిరేకించిన చైనా, రష్యా

వియన్నా: ఇరాన్‌ అణు సంబంధమైన అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని ఇంటర్నేషనల్‌ ఆటమిక్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) గురువారం తీర్మానించింది. వియన్నాలో జరిగిన ఏజెన్సీ బోర్డు సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. గత రెండు దశాబ్దాల్లో తొలిసారిగా ఇరాన్‌ తన అణు సంబంధ బాధ్యతల్ని ఉల్లంఘిస్తోందని ఐఏఈఏ వెల్లడించింది. ఈ తీర్మానంతో ఇరాన్‌పై ఈ సంవత్సరాంతంలోగా ఐక్యరాజ్య సమితి ఆంక్షలు తిరిగి విధించేందుకు అవకాశం ఏర్పడింది. ఈ తీర్మానంపై సత్వరం స్పందించిన ఇరాన్‌ ఒక సురక్షిత ప్రదేశంలో కొత్త యురేనియం శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించింది. ‘ఐఏఈఏ రాజకీయ ఉద్దేశాలతో చేసిన తీర్మానానికి ఇస్లామిక్‌ గణతంత్ర రాజ్యమైన ఇరాన్‌ దీటుగా సమాధానం చెప్పక తప్పలేదు’ అని ఇరాన్‌ విదేశాంగశాఖ, అణు విద్యుత్‌ సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఐఏఈఏ బోర్డు సభ్యులుగా ఉన్న 19 దేశాలు ఇరాన్‌కు వ్యతిరేకంగా తీర్మానించాయని దౌత్య వర్గాలు తెలిపాయి. అయితే రష్యా, చైనా, బుర్కినాఫాసో దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి…