*బరువు సమస్య*
*హాస్యకథ*
సత్తిపండుకు బాగా అర్థమైంది… తన సమస్యకు సాంప్రదాయ పద్ధతులు లాభం లేదని, ఆ సమస్య పాతదైనా, పరిష్కారాలు మాత్రం కొత్తగా వెదకాల్సిందేనని. పైగా దైవబలం కూడా కలిసిరావాలని. ఆయన సమస్య డబ్బు కాదు… అలా అని జబ్బు కాదు. ఒంట్లో పోగేసుకున్న కొవ్వు, అధిక బరువు. మొదట్లో చువ్వలా ఉండేవాడు. అలా చూస్తుండగానే శుక్లపక్ష చంద్రునిలా నెలనెలకీ పెరిగి 100 కేజీల మార్కు దాటేశాడు. గుండ్రాయిలా తయారవ్వాల్సింది కాస్తా గుండ్రంగా తయారయ్యాడు. పక్కింటి లెక్కల మాస్టారు మొదట్లో ఈయన్ని చూపి, “దీర్ఘచతురస్రం అంటే ఇలా ఉంటుందిరా పిల్లలూ” అనేవాడు. కాస్తా ఇప్పుడు “వృత్తాకారం”తో పోలుస్తున్నాడంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంతాచేసి సత్తిపండు వయసు 30 పూర్ణ వసంతాలు దాటలేదు.
ఒకసారి వాళ్లావిడతో అన్నాడు, “ఏమోయ్! నువ్వు బాగా వండి పెడుతున్నావ్. నేను తిని పెడుతున్నాను. మరి నువ్వు సన్నగా, నేను లావుగా ఎందుకు తయారయ్యాను?”
ఆవిడ చెప్పింది, “మీరు తినడం మొదలెట్టాక కళ్లుమూసుకుని తాదాత్మ్యంలో నా ప్లేటు కూడా ఖాళీ చేస్తున్నారు స్వామీ. మీ అమితాహార దీక్షకు ఎందుకు ఆటంకం కలిగించడం ఎందుకని నేను మంచినీళ్లు తాగి బతుకుతున్నాను.”
ఆ నిజాన్ని గ్రహించి సత్తిపండు కళ్లుతెరిచి తినడం మొదలుపెట్టాడు. అంటే నా ఉద్దేశ్యం నోరు తెరిచే తింటాడు… కానీ కళ్లుమూసుకోవడం లేదు. అయినా పెద్ద లాభం లేకపోయేసరికి, “ఏం చెయ్యాలోయ్! ఏ ఫలితమూ లేదు” అని బావురుమన్నాడు… చేతిలో మిగిలిన సగం లడ్డూను కొరుకుతూనే.
బాగా ఆలోచించి ఆవిడ చెప్పింది. “ఒకప్పుడు ఆఫీసు నుంచి రాగానే నాకు సాయం చేసేవారు. ఇప్పుడలాంటిదేమీ లేదు. ఆ సాయాలు కొంచెం మొదలెట్టండి. మొదటిగా అదిగో, ఆ పూచికపుల్ల ఇటు పెట్టండి.”
“అబ్బా! ఇప్పుడా? అలిసిపోయాను. తర్వాత పెడతానులే.”
ఆవిడ ఓ చూపు చూసి ఆ పనేదో తానే చేసుకుంది.
ఆ తర్వాత సత్తిపండు జిమ్లో చేరాడు. రెండ్రోజులు వెళ్లి, “వాళ్లు నా డబ్బులు తీసుకుని, నాకే ఐరన్ పనులు అప్పజెప్తారా?” అని ఫీల్ అయ్యి మానేశాడు.
మరోసారి ఏదో జ్యూస్ థెరపీ ట్రై చెయ్యబోతే, ఒంట్లో నీరంతా పిండినట్టుగా అయిపోయింది. ఆపి బతికి బయటపడ్డాడు.
ఈసారి మాత్రం ఎలాగైనా తన బరువును 100 కేజీల లోపుకి తేవాలని వందోసారి కంకణం కట్టుకున్నాడు. ఆయన పుణ్యమాని వీధి చివరలో కంకణాలు అమ్మేవాడు బాగుపడ్డాడు తప్పించి, ఇంతవరకు ఫలితం నాస్తి. ఈసారి ఏమవుతుందో చూడాలి.
“ఏమోయ్! నా ప్రతిజ్ఞ నెరవేరాలంటే నా శక్తి ఒక్కటే చాలదు. దైవశక్తి కూడా తోడవ్వాలి. అందుకనే వినాయకచవితి రోజు నిష్టగా పూజ చేసి సంకల్పం మొదలెడతాను.”
‘ఎప్పుడూ ఉన్న గొడవే అనుకున్న’ ఆవిడ ఇటు తిరగకుండానే బదులిచ్చింది, “ఎవరొద్దని అన్నారండీ? అలాగే చెయ్యండి. కానీ ఏం చేసినా రెండ్రోజుల తర్వాత ఇక చాలనకుండా ఆపకుండా ఉండండి. ఇంతకీ ఏం చేస్తారు?”
“ముందు పూజ చేస్తాను. తన పొట్ట పెరిగినందుకు నవ్విన చంద్రుణ్ణి శపించిన గణపతి కన్నా నన్నెవరు అర్థం చేసుకోగలరు?” భక్తిగా అన్నాడు సత్తిపండు.
“అలాగే కానీ ముందు పూజ కోసం రిహార్సల్ చేయండి. అసలే మీరు చాలా కాలమైంది పూజలో కూర్చుని.”
“మంచి ఐడియా. ఒకసారి చూసుకుంటే ఆరోజు సజావుగా చెయ్యొచ్చు.”
సత్తిపండు వ్రతవిధానం పుస్తకం తెరిచాడు. అంతా బాగానే ఉంది కానీ మంత్రాల దగ్గర నోరు తిరగడం లేదు.
కజ్జికాయ నముల్తున్నప్పుడు అష్టదిక్కులు తిరిగే నాలుక, ఒక మంత్రం పలకడానికి మాత్రం కొండచిలువలా పడి ఉంటుంది తప్ప సహకరించడం లేదు. ఇంకా గట్టిగా ప్రయత్నిస్తే నానా రకాల అపశబ్దాలు పలుకుతోంది.
లాభం లేదని అర్థమై సత్తిపండు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు.
ఇంకేం! పూజకు అవసరమైన మంత్రాలన్నీ అది చదువుతుంటే, తాను పత్రి, పువ్వులూ సమర్పిస్తే సరిపోయింది. వినాయకచవితి రోజు అలాగే మొదలెట్టాడు. భక్తిగా అంతా సాగుతుంది. కరెక్టుగా మంత్రాల మధ్యలో యాడ్ మొదలైంది…
“మీకు, భగవంతునికీ మధ్య ఉన్నది మా అగరబత్తి!”
“అంటూ ఇదెక్కడి పానకంలో పుడక!” అని విసుక్కుంటూ ఆగిపోయాడు.
కాసేపయ్యాక మళ్లీ ఇంకో యాడ్.
తర్వాత తీరిగ్గా చెప్పింది:
“యాప్ ప్రకటనలు లేని సేవలు కావాలంటే ప్రీమియర్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ వెయ్యి రూపాయలు మాత్రమే.”
అంటూ సత్తిపండు ఫాలో అయిపోయాడు. మరేం చెయ్యగలడు?
పూజ తర్వాత చెప్పాడు, “గణపతి దారి చూపించాడోయ్. ఇదే నోయ్! నా సమస్యకు సాయపడేది.”
ఆవిడకు అర్థం కాలేదు. ఫోన్ చూపించి ఇలా మాట్లాడతాడేమిటి చెప్మా అనుకుని వెర్రిగా చూసింది.
“నీకు అర్థం కాలేదు కదూ! ఇదిగో ఈ యాప్ చూడు. ప్లే స్టోర్ చూస్తుండగా కంటబడింది. నా తిండిని కేలరీల్లో లెక్క పెట్టి రోజూ ఎంతవరకూ తినొచ్చో సలహా ఇస్తుంది. అలా చేస్తే ఆరు నెలల్లో బరువు తగ్గొచ్చు. ఒకవేళ తగ్గకపోతే కట్టిన డబ్బు వెనక్కి ఇచ్చేస్తామని కూడా చెప్పారు.”
“వార్నీ! నేను చీర కోసం అడిగితే వందసార్లు తిప్పి తిప్పి చూస్తారు. దీనికి ఎంత కట్టారేమిటి?”
“జస్ట్ ఏభై వేలు.”
ఆవిడ కళ్లు తిరిగి పడిపోయింది. జరగబోయే ఉపద్రవం ముందే తెలుసు కాబట్టి సత్తిపండు రెడీగా ఉంచిన చెంబులో నీళ్లు ఆవిడ ముఖంపై చిలకరించాడు.
ఆవిడ, “మీ తెలివి తగలెయ్యా! ఏమీ ఇవ్వకపోయినా ఆ లెక్కలు నేను చెప్పేదాన్ని కదా!” అంటూ శోకాలు పెట్టింది.
“ఆరు నెలల తర్వాత మార్పు నువ్వే చూస్తావుగా. నా కోసం కొంచెం ఓర్చుకో.”
ఇక మొదలైంది సత్తిపండు భార నియంత్రణ యాగం.
తినేది ఫోటో తీసి యాప్కి చూపించడం. యాప్ కేలరీలు లెక్కించడం. సలహాలు ఇవ్వడం.
మూడు నెలల తర్వాత బరువు చూసుకుంటే ఆ వెయింగ్ మెషిన్ నవ్వినట్టు అనిపించింది. మరో రెండు కేజీలు పెరిగాడు.
యాప్ చెప్పింది:
“నువ్వు సరిగ్గానే తింటున్నావు. కానీ నిద్రపోతున్నట్టు లేవు. అప్పుడు కూడా బరువు పెరుగుతుంది. కాబట్టి స్లీప్ ట్రాకర్ యాప్ కూడా కొనుక్కో. దాని రేటు జస్ట్ 20 వేలు.”
ఇప్పుడు సత్తిపండు నిద్ర లెక్కిస్తున్నాడు. అది అవసరానికి మించే ఉంటుందని యాప్ చెప్పింది.
ఇంకో నెల తర్వాత మరో యాప్ కొనిపించింది. ఈసారి కొలెస్ట్రాల్ లెక్కలు.
చివరికి నాలుగో నెల తర్వాత, యాప్లకి ఎనభై వేలు వదిలాక తేల్చింది…
“ఇంకా నువ్వు బరువు పెరుగుతున్నావంటే ఆధునిక వైద్యశాస్త్రానికి అందని జబ్బేదో నీకు ఉంది. అది నా తప్పు కాదు. కాబట్టి ముందుచెప్పినట్లు డబ్బులు వెనక్కి రావు.”
అంటూ సత్తిపండు హతాశుడయ్యాడు.
ఆ బాధలో రెండు నెలలు తిండీ, నిద్రా సరిగ్గా లేవు. ఆ తర్వాత చూసేసరికి బరువు తగ్గిపోయి ఉన్నాడు.
“చూశారా, నా ఘనత!” అంటూ ఆ యాప్ సత్తిపండు ఫోటోల్ని ట్యాగ్ చేసుకుంది. తన సూచనలతోనే సత్తిపండు బరువు తగ్గాడంటూ ప్రమోట్ చేసుకుంటుంది.
సత్తిపండు, ఆయన భార్య నోరెళ్లబెట్టారు గానీ నిజం చెప్పడానికి నోరు మెదపడం లేదు.
యాప్ యాపారం మాత్రం దిగ్విజయంగా పెరిగిపోతోంది!
— సమాప్తం —