ఉత్పత్తి తగ్గడానికి కారణం కార్మికుడు కాదు, కాంగ్రెసోడు కారణం వాడి అంతు చూడాలి.- కేటీఆర్

సింగరేణిలో అవినీతి రైజింగ్, ప్రొడక్షన్ ఫాలింగ్

మేము దిగిపోయే నాటికి 2023 డిసెంబర్‌లో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి 70 మిలియన్ టన్నులు

పోయిన ఏడాది 2025-26లో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కేవలం 58 మిలియన్ టన్నులు మాత్రమే

రాను రాను పెరిగేది పోయి, రాజుగారి గుర్రం గాడిద అయినట్లు బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది..

ఉత్పత్తి తగ్గడానికి కారణం కార్మికుడు కాదు, కాంగ్రెసోడు కారణం వాడి అంతు చూడాలి.- కేటీఆర్.

KTR ….వచ్చేటప్పుడు కరీంనగర్‌లో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీశ్‌ బాబు ఆపితే అక్కడ కొద్దిసేపు ఆగిన. ఏం సంగతి ఏమో గడ్డం పెంచినవ్‌ అని అడిగిండు. పోయేదెక్కడికి గోదావరి ఖనికి.. ఆ మాత్రం ఉండాలే కదా అని చెప్పిన. పోయేది సింగరేణికి కదా ఆ మాత్రం ఉండాలే.. లేకపోతే నడువదు అని చెప్పిన అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. గోదావరి ఖని సింగరేణి స్టేడియంలో ’సింగరేణి కార్మిక గర్జన’లో కేటీఆర్ మాట్లాడుతూ.. పోరాటాల పురిటి గడ్డ రామగుండం అంటేనే రణగర్జన చేసే రణరంగం ఈ గడ్డ. నల్లబంగారు గనుల నుంచి తరలివచ్చిన మా కార్మిక అన్నలందరికీ హృదయపూర్వక వందనం. చెమట, నెత్తురు దారపోసి ఈ దేశానికి విద్యుత్‌ అందించి వెలుగులు ప్రసరించే విధంగా కష్టపడుతున్న ప్రతీ కార్మిక సోదరుడికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు..సింగరేణిది 137 ఏండ్ల చరిత్ర. ఈ నాటిది కాదిది. కార్మికుల త్యాగముఉన్నది.. కార్మికుల కష్టమున్నది. నల్లబొగ్గుకు నెత్తురు అద్ది ఎన్నో సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికులున్నారు. అవిటివాళ్లైన వాళ్లున్నరు. చీకటి గుహల్లో రక్తతర్పనం చేసినవాళ్లున్నారు. ఎన్నో త్యాగాలు చేసినవాళ్లున్నారు. ఎన్నో త్యాగాలు చేసిన వేలాది కార్మికుల కుటుంబాలున్నాయి. చావుతో సహవాసం చేసే సత్తా ఉన్న కార్మిక సోదరులు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నరా.. అంటే మన సంగిరేణిలోనే ఉన్నరని గర్వంగా చెప్పుకోవచ్చునన్నారు.

మీకు బొగ్గు ఉత్పత్తి చేయడమే కాదు.. ఉద్యమాలను ఉత్పత్తి చేయడం కూడా బ్రహ్మాండంగా తెలుసునని కేటీఆర్ పేర్కొన్నారు. మీ అందరికీ, మా అందరికీ గుర్తుంది. ఉత్పత్తిలో మొనగాళ్లు, ఉద్యమాల్లో కూడా మొనగాళ్లు మీరు. ఆనాడు బాగా యాదికుంది.. కేసీఆర్ పిలుపునిస్తే సకలజనుల సమ్మెలో 35 రోజులపాటు ఒకసారి, 7 రోజులు ఒకసారి 42 రోజులపాటు ఒక్క బొగ్గు పెళ్ల రాకుండా మీరు ఆరోజు తిరగబడితే మొత్తం దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయిన మాట ఎవరూ మరిచిపోలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆ రోజుల కేసీఆర్ తెలంగాణ జెండా ఎగరేసి బయలుదేరితే ఆయనకు అండగా నిలబడ్డది.. ఇదే సింగరేణి కార్మిక లోకమనే మాట మేమెవరం మరిచిపోలేదు. ఆ రోజు కేసీఆర్ కో అంటే మీరు కోల్‌ బెల్ట్‌ మొత్తంకో అని బయలుదేరారన్నారు.