సౌదీలో ఇద్దరు బంగ్లాదేశీ దంపతులకు ఉరిశిక్ష….. మక్కా మజీద్ లో అసభ్యకరమైన పనులు చేశారని మరణశిక్ష విధింపు….
సౌదీ అరేబియాలోని మక్కా ప్రాంతంలో ఒక మసీదులో అనుచిత చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులకు అక్కడి అధికారులు మరణశిక్ష అమలు చేశారు. నజెరుల్ ఇస్లాం అబ్దుల్ బాసిర్, సితి అక్తర్ అనే ఇద్దరికి అక్టోబరు 14న శిక్షలు అమలు చేసినట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
సౌదీ అధికారిక వార్తా సంస్థ ప్రకారం, నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరిపిన అనంతరం వారిని ప్రత్యేక న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. కోర్టు విచారణలో నిందితులు చేసిన నేరం రుజువు కావడంతో, ఆ అసాధారణమైన అపచారానికి విచక్షణాధికార శిక్ష కింద మరణశిక్ష విధించబారు. ఈ తీర్పును సుప్రీం కోర్టు సమర్థించడం , రాజముద్ర జారీ కావడంతో శిక్ష అమలు పూర్తయింది.
పవిత్రమైన మక్కా , మదీనా నగరాల్లోని మసీదుల పవిత్రతను రక్షించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని సౌదీ స్పష్టం చేసింది. మత విశ్వాసాలకు, స్థానిక చట్టాలకు భంగం కలిగించేలా ఎవరైనా అనైతిక పనులకు పాల్పడితే వారి స్వదేశంతో సంబంధం లేకుండా చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. కాగా, ఈ శిక్షల అమలుకు సంబంధించి తమకు ముందస్తు సమాచారం అందలేదని జిద్దాలోని బంగ్లాదేశ్ కాన్సులేట్ ప్రతినిధులు తెలిపారు.
పవిత్ర స్థలాల్లో ఇటువంటి కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా పవిత్రతను కాపాడటమే కాకుండా, చట్ట ఉల్లంఘనలకు పాల్పడేవారికి బలమైన నిరోధక సంకేతం పంపడమే సౌదీ అరేబియా ఉద్దేశంగా కనిపిస్తోంది. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో మక్కా పరిసరాల్లో జరిగే లైంగిక వేధింపులు , ఇతర నేరాలపై కూడా ఇదే స్థాయిలో నిరంతరం పారదర్శకమైన చర్యలుండాలని మానవ హక్కుల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.