5జీ అప్‌గ్రేడ్‌ పేరిట సైబర్‌ మోసాలు..! జాగ్రత్తగా ఉండాలని పోలీసుల సూచన…

సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. కేటగాళ్ల బారినపడకుండా అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది అమాయకులు సైబర్‌ నేరగాళ్ల బారినపడుతున్నారు. ఇప్పటి వరకు బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, డిబిట్‌ కార్డు అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని.. లారీ వచ్చిందంటూ నమ్మ బలికి అకౌంట్లలో ఉన్న సొత్తు లూటీ చేసిన సంఘటనలున్నాయి.

తాజాగా దేశంలో 5జీ సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు దిగారు. 5జీ సర్వీస్‌ అప్‌గ్రేట్‌ పేరుతో కేటగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. సెల్‌ఫోన్‌ను 5జీకి అప్‌గ్రేడ్‌ చేసుకోవాలంటూ పలువురికి ఫోన్లు చేస్తూ.. ఓటీపీ చెప్పాలని కోరుతున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 5జీ అప్‌గ్రేడ్‌ పేరిట ఎవరైనా ఫోన్లు చేస్తే.. నమ్మొద్దని, ఓటీపీలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దని, తప్పనిసరిగా టెలీకాం స్టోర్స్‌కు వెళ్లి వివరాలు తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.