78 ఏళ్ల పట్టుదల.. యువతకు కనువిప్పు!

78 ఏళ్ల పట్టుదల.. యువతకు కనువిప్పు!..
జీవితంలో గెలుపు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్న ఉదాహరణ ఈ బామ్మ.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన 78 ఏళ్ల రామసుబ్బమ్మ గతంలో పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో కార్మికురాలిగా పనిచేశారు.
ఆ రోజుల్లో విద్యార్థుల కోసం నిర్వహించే ఆటల పోటీలను చూస్తూ, తానూ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు.
ఆ సంకల్పమే ఆమెను 2016 నుంచి వెటరన్‌ క్రీడాకారిణిగా మారుస్తోంది..

నెల్లూరు జిల్లా కావలికి చెందిన 78 ఏళ్ల రామసుబ్బమ్మ గారిని చూస్తుంటే.. “వార్ధక్యం శరీరానికే కానీ, సంకల్పానికి కాదు” అనిపిస్తుంది. ఒకప్పుడు పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పని చేసి.. నేడు ఇళ్లలో పనులు చేసుకుంటూనే.. ట్రాక్ మీద చిరుతపులిలా పరుగెడుతున్న ఆమె స్ఫూర్తి అద్వితీయం.

12 బంగారు పతకాలను ముద్దాడి, నేడు అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేయడానికి సిద్ధమవుతున్న ఆమె “మనోబలం” నేటి యువతకు ఒక పాఠం.

20 ఏళ్లు నిండకముందే బద్ధకానికి బానిసలై, అల్ప సంతోషాల కోసం ప్రాకులాడుతున్న ఓ యువత.. ఒక్కసారి ఆలోచించండి! చిరు కష్టానికే కుంగిపోతూ, స్మార్ట్ ఫోన్ మాయలో పడి మీ బంగారు భవిష్యత్తును బుడిద చేసుకుంటారా? గంజాయి, మద్యం వంటి వ్యసనాల ఊబిలో చిక్కుకొని జీవితాన్ని ట్రాక్ తప్పిస్తారా?

78 ఏళ్ల వయసులో ఆమె పతకాల వేటలో ఉంటే, లేత వయసులో మీరు మత్తులో జోగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా? ఇప్పటికైనా మేల్కోండి! ఆమె అడుగుజాడల్లో నడవండి. శ్రమను నమ్ముకోండి, శిఖరాలను అధిరోహించండి.

సలాం రామసుబ్బమ్మ మీ పట్టుదలే అంద‌రికీ స్ఫూర్తిదాయకం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు..