తెలంగాణలో సాధారణ విద్యుత్ వినియోగదారులకు వచ్చేనెల (నవంబర్ 2026) నుంచి విద్యుత్ బిల్లులు పెరగనున్నాయి. రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) రూ. 5,420.23 కోట్లు వసూలు చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) అనుమతించింది.
ప్రభుత్వ వాదన..
జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గిపోవడం వల్ల కరెంట్‌కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. సాధారణంగా ఏటా 6 నుంచి 7 శాతం వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకొని నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేస్తారు. అయితే ఈ ఏడాది డిమాండ్ ఒక్కసారిగా 23 శాతం నుంచి 88 శాతం వరకు పెరగడంతో డిస్కంలు అల్లాడుతున్నాయి.
88.9 శాతం అధిక డిమాండ్
తెలంగాణలో వర్షాకాలంలో మునుపెన్నడూ లేని విధంగా సెప్టెంబర్ 9, 2026న 19,543 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదైంది. కిందటి ఏడాది ఇదే రోజున 15,906 మెగావాట్లు మాత్రమే ఉంది. ఇదే రికార్డు స్థాయిగా భావిస్తున్న తరుణంలోనే సెప్టెంబర్ 30న ఏకంగా 19,892 మెగావాట్ల డిమాండ్‌తో మరో కొత్త రికార్డు నమోదైంది. సెప్టెంబర్ 30, 2025న నమోదైన 10,529 మెగావాట్ల డిమాండ్‌తో పోలిస్తే ఈసారి ఏకంగా 88.9 శాతం డిమాండ్ అధికం కావడం గమనార్హం.
ఐఈఎక్స్లోనూ కరెంట్ దొరకడం లేదు
నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించడానికి అన్ని రాష్ట్రాల డిస్కంలు ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (ఐఈఎక్స్)లో యూనిట్‌కు రూ.10 చొప్పున చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేయడం ఆనవాయితీ. అయితే ప్రస్తుతం అక్కడ కూడా కరెంట్ లభ్యం కావడం లేదు. ఈ నెల 1న సాయంత్రం 4 గంటల వేళలో తెలంగాణ డిస్కంలు యూనిట్‌కు రూ.10 చొప్పున 9,636 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తామని ఐఈఎక్స్‌ను కోరగా, కేవలం 428 మెగావాట్లు మాత్రమే దొరికింది.
కొన్న కెరెంటుపైనే ఆధారం..
పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో రాష్ట్రంలో చేస్తున్న విద్యుత్ ఉత్పత్తి కీలక పాత్ర పోషిస్తుంది. కానీ అది ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు సెప్టెంబర్ 28న రాష్ట్రంలో 33 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వినియోగించాం. ఇందులో జెన్కో సొంత ప్లాంట్ల నుంచి కేవలం 8.5 కోట్ల యూనిట్లు మాత్రమే వచ్చింది. మిగిలిన విద్యుత్ మొత్తం బయటి నుంచి సేకరించిందే.
పగటిపూట సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా రాష్ట్రానికి 6 కోట్ల యూనిట్ల విద్యుత్ లభిస్తుంది. అయితే సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు సౌర విద్యుత్ అందుబాటులో ఉండదు. దీంతో ఈ సమయంలో కరెంట్ సరఫరా చేయడానికి ఎక్స్ఛేంజ్ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది…
మన రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 20.63 లక్షల టన్నుల బొగ్గు కనీస నిల్వ ఉండాలి. కానీ కేవలం 5.57 లక్షల టన్నులు అంటే అందులో 27 శాతం మాత్రమే నిల్వ మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సింగరేణి గనుల నుంచి జీ8, జీ9 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి లేకపోవడంతో కొత్తగూడెం థర్మల్ ప్లాంట్‌లో 800, భద్రాద్రిలో 1,080, యాదాద్రి 3,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పూర్తి సామర్థ్యంతో జరగడం లేదు. కోల్ ఇండియా గనుల నుంచి నాణ్యమైన బొగ్గు సరఫరాకు విద్యుత్ శాఖ ఆరు నెలల కిందటే ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ప్రస్తుత కొరత చాలా వరకు తీరేదని విద్యుత్ ఇంజినీర్లు చెబుతున్నారు..
ఎవరిపై భారం పడుతుంది: వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారులు (గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు) అందరికీ ఈ చార్జీలు వర్తిస్తాయి…