ఆమ్ ఆద్మీపార్టీ ప్రభుత్వపై, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు..!

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీపార్టీ ప్రభుత్వపై, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు…సంగ్రూర్ లో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. పంజాబ్‌లోని లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ సమస్య, గ్యాంగ్‌స్టర్ వ్యవస్థపై నిప్పులు చెరిగారు..పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వ్యక్తిగత అలవాట్లను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. “గతంలో భగవంత్ మాన్ లోక్‌సభలో నా పక్కనే కూర్చునేవారు. ఆయన నాతో జోకులు చెప్తున్న సమయంలో ఉదయం 11 గంటలకే ఆయన నోటి నుంచి మద్యం వాసన వచ్చేది. మద్యం తాగడం ఆయన వ్యక్తిగత విషయమే కావచ్చు. కానీ మీరు పంజాబ్‌లో డ్రగ్స్, మత్తు లేని వ్యవస్థ కోసం పోరాడాలనుకుంటే.. రోజు సాయంత్రం వేళల్లో స్వయంగా మత్తులో మునిగిపోయే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే అది ఎలా సాధ్యమవుతుంది?” అని రాహుల్ గాంధీ నేరుగా ప్రశ్నించారు. పంజాబ్ ప్రజల బాధలను అర్థం చేసుకునే ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమని రాహుల్ పేర్కొన్నారు..

ఆప్, బీజేపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలం

రాష్ట్రంలో సింథటిక్ డ్రగ్స్ సృష్టించే విధ్వంసంపై మాట్లాడిన రాహుల్ గాంధీ.. డ్రగ్స్ ను రూపుమాపుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆ పని చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో పరిశ్రమలు, మౌలిక వసతులు కల్పించకపోతే డ్రగ్స్, గ్యాంగ్‌స్టర్ సంస్కృతి మరింత వేగంగా వ్యాపిస్తుందని హెచ్చరించారు.

అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీలపై కూడా రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “మూడేళ్లలో డ్రగ్స్ రహిత దేశంగా మారుస్తామని అమిత్ షా చెప్తున్నారు. కానీ ఈ లోపే కేంద్రంలో ఉన్న ఈ ప్రభుత్వం పడిపోతుంది. అదానీ పోర్టులో పట్టుబడిన వేల కోట్ల రూపాయల డ్రగ్స్ కథ ఏమైందో సమాధానం చెప్పాలి” అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ తనతో ఏ వేదికపై అయినా చర్చకు రావాల్సిందిగా సవాలు విసిరారు..