రాష్ట్ర అటవీశాఖ కీలక నిర్ణయంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే నయనా మోతమ్మ తాజాగా రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర స్పీకర్ ఆఫీస్ కు సమర్పించారు..రాష్ట్ర అటవీ శాఖ చేపట్టిన ఆపరేషన్ లో భాగంగా హసన్ జిల్లా బేలూరు ప్రాంతం నుంచి 50- 60 అడవి ఏనుగులను చిక్కమగళూరులోని భద్రా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి తరలించే ప్రక్రియను నిరసిస్తూ ఆమె రాజీనామా చేశారు. ఇక నయనా మోతమ్మ నుంచి రాజీనామా లేఖ అందినట్లు రాష్ట్ర స్పీకర్ కార్యాలయం ధృవీకరించింది. అయితే ఆమె రాజీనామాపై స్పీకర్ జీఎస్ పాటిల్ ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..అడవి ఏనుగుల తరలింపు నిర్ణయం రైతులకు ప్రమాదకరంగా మారుతుందని, మనిషి – ఏనుగు ఘర్షణలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే హెచ్చరించారు. రాష్ట్రంలోని హసన్ జిల్లా బేలూరు ప్రాంతంలో సుమారు 50 నుంచి 60 అడవి ఏనుగులు నిత్యం సంచరిస్తూ మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. ఇటీవల ఈ ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి చెందారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర అటవీశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అడవి ఏనుగులను చిక్కమగళూరులోని భద్రా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి తరలించాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని స్థానిక మూడిగెరె ఎమ్మెల్యే నయనా మోతమ్మ వ్యతిరేకించారు. అక్కడి ఏనుగులను తమ నియోజకవర్గం పరిధిలోని అడవులకు తరలించడం కారణంగా మరిన్ని సమస్యలు ఎదురవుతాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించకుండానే అటవీశాఖ నిర్ణయం తీసుకోవడాన్ని ఆమె వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే ఆమె తన నియోజకవర్గానికి రాజీనామా చేశారు..