నేపాల్ అభివృద్ధికి రూ.24 వేల కోట్ల ఆర్థిక సాయం : ప్రధాని మోదీ..

పొరుగు దేశం నేపాల్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. నేపాల్ అభివృద్ధి, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణం కోసం 24 వేల కోట్ల నేపాలీ రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. భారత కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.15 వేల కోట్లు. సోమవారం ఢిల్లీలో నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం మోదీ ఈ ప్రకటన చేశారు.

గత ఆగస్టులో నేపాల్‌లో సంభవించిన భారీ వరదల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాధిత కుటుంబాలను ఆదుకోవడంతో పాటు రోడ్లు, వంతెనలు, ఇతర అభివృద్ధి పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు. భవిష్యత్తులో ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడం కూడా ఈ ప్యాకేజీ లక్ష్యమని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా భారత్, నేపాల్ మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. అయోధ్య నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్‌కు నూతన రైలు సర్వీసును ఇరు దేశాల ప్రధానులు ప్రారంభించారు. రవాణా, వాణిజ్యం, విద్యుత్ రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించారు. కష్టకాలంలో నేపాల్‌కు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. భారత సహకారానికి నేపాల్ ప్రధాని బాలేంద్ర షా కృతజ్ఞతలు తెలిపారు…

ఆగస్టులో నేపాల్‌లో సంభవించిన భారీ వరదల వల్ల జరిగిన ప్రాణనష్టంపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత కుటుంబాలు తిరిగి సాధారణ జీవితం గడిపేందుకు, కొత్త అవకాశాలు అందిపుచ్చుకునేందుకు భారత్ అందించే సాయం ఉపయోగపడుతుందని చెప్పారు. భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కొనేలా నేపాల్ సామర్థ్యాన్ని పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. భారత్‌, నేపాల్‌ మధ్య సంబంధాలు కేవలం పొరుగు దేశాలకే పరిమితం కావని మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య ఆత్మీయత, పరస్పర విశ్వాసం ఉన్నాయని, ఒకరి ప్రగతిలో మరొకరు భాగస్వాములమని చెప్పారు. సంతోషాలు, సవాళ్లు ఉమ్మడివేనని, కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలుస్తామని వివరించారు.

ఎనిమిది కీలక ఒప్పందాలు
నేపాల్ ప్రధాని బాలేంద్ర షా పర్యటన సందర్భంగా భారత్‌, నేపాల్‌ ఎనిమిది అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అంతరిక్ష సాంకేతికత, భద్రతా శిక్షణ, పౌర సేవల సామర్థ్య పెంపు, ఆరోగ్యం, సంప్రదాయ వైద్యం, పట్టణాభివృద్ధి, వ్యవసాయం వంటి రంగాల్లో సహకారానికి ఈ ఒప్పందాలు మార్గం సుగమం చేయనున్నాయి. అంతరిక్ష, సమాచార రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), నేపాల్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మధ్య ఒప్పందం కుదిరింది. దక్షిణాసియా ఉపగ్రహ సేవల వినియోగం కోసం శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్‌కామ్‌) నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయడం దీని ప్రధాన ఉద్దేశం…

ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లోనూ భాగస్వామ్యం
ఆరోగ్య సంరక్షణ రంగంలోనూ ఇరు దేశాలు రెండు ఒప్పందాలు చేసుకున్నాయి. వైద్యం, ఆరోగ్య రంగాల్లో సహకారానికి భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నేపాల్‌ ఆరోగ్య, ఆహార భద్రతా మంత్రిత్వ శాఖ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆయుర్వేదం, ఇతర సంప్రదాయ వైద్య విధానాల అభివృద్ధికి ప్రభుత్వాల మధ్య మరో ఒప్పందం జరిగింది. సుస్థిర పట్టణాభివృద్ధికి అవసరమైన సాంకేతిక సహకారం, పశుసంపద, మత్స్య సంపద అభివృద్ధి అంశాలపైనా ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాలతో ఆయా రంగాల్లో పరస్పర అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు అవకాశం కలగనుంది.

అయోధ్య-జనక్‌పుర్‌ మధ్య కొత్త రైలు
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య కంటోన్మెంట్‌ నుంచి నేపాల్‌లోని జనక్‌పుర్‌ ధామ్‌ వరకు నడిచే సరియు-కమలా ఎక్స్‌ప్రెస్‌ వారపు రైలును ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షా సోమవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ రైలు సర్వీసుతో ఇరు దేశాల్లోని రెండు ముఖ్యమైన మతపరమైన ప్రాంతాల మధ్య ప్రయాణం సులభతరం కానుంది. అయోధ్య, జనక్‌పుర్‌ ప్రాంతాలకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ సేవ కీలకంగా మారనుంది..