చైనా బార్డర్‌లోని 40 గ్రామాల్లో జనాభా పెరిగింది- వలసలు ఆగిపోయాయ్: అమిత్ షా…

కేంద్రం అక్కడ ఉపాధి, ఆరోగ్య సౌకర్యాలు కల్పించడంతో చైనా సరిహద్దులోని 40 గ్రామాల్లో జనాభా పెరిగి, వలసలు ఆగిపోయాయని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలిపారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఒక సహకార సదస్సులో ప్రసంగిస్తూ, ఈ గ్రామాల్లోని సహకార సంఘాల నుండి ఉత్పత్తులను సేకరించాలని హోం మంత్రిత్వ శాఖ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) మరియు సైన్యాన్ని ఆదేశించిన తర్వాత గ్రామాలకు, సాయుధ దళాలకు మధ్య బంధం బలపడిందని అమిత్ షా అన్నారు.

ఆయన మాట్లాడుతూ, “నేను నిన్న దీనిని సమీక్షించాను. చైనా సరిహద్దులో ఉన్న 40 గ్రామాలకు ప్రజలు తిరిగి రావడం ప్రారంభించడం, అక్కడి జనాభా పెరగడం, వలసలు ఆగిపోవడం నాకు సంతోషాన్నిచ్చింది. విద్యుత్, ఉపాధి, ఆరోగ్య సౌకర్యాలపై చర్చ జరిగింది. కొండ ప్రాంతాలకు నీటి సరఫరా కూడా చేపట్టారు. ఐటీబీపీ, సైన్యం తమ ఉత్పత్తులను తేజ్‌పూర్ లేదా గౌహతి నుండి సేకరించకూడదని, వాటిని తప్పనిసరిగా గ్రామాలు, సహకార సంఘాల నుండే సేకరించాలని హోం మంత్రిత్వ శాఖ కఠినంగా ఆదేశించింది.”

అభివృద్ధి సరిహద్దుల నుంచే ప్రారంభం కావాలి’
“2004-2014 వరకు యూపీఏ ప్రభుత్వం అరుణాచల్‌ ప్రదేశ్‌కు రూ. 33,530 కోట్లు మాత్రమే ఇచ్చింది. అదే సమయంలో 2014-2024 వరకు ఎన్‌డీఏ సర్కార్ ఈ ఈశాన్య రాష్ట్రానికి చేసిన ఆర్థిక సహాయం రూ. 1,64,664 కోట్లకు పెరిగింది. రాష్ట్రానికి అందే పన్ను వాటా నాలుగు రెట్లు, గ్రాంట్లు 18 రెట్లు పెరిగాయి. ఈ గణాంకాలు అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి. అరుణాచల్ బడ్జెట్ రూ.12,000 కోట్ల నుంచి రూ. 36,000 కోట్లకు పెరగడం గత 12 ఏళ్లలో అభివృద్ధి ఏ స్థాయిలో విస్తరించిందో తెలియజేస్తుంది. సరిహద్దు గ్రామాలను దేశ చివరి గ్రామాలు అని కాకుండా దేశ మొదటి గ్రామాలుగా అభివర్ణించడం ద్వారా ప్రధాని మోదీ ఆ ఊర్ల పట్ల ఉన్న దృక్పథాన్ని మార్చారు. అభివృద్ధి సరిహద్దుల నుంచే ప్రారంభం కావాలి. అక్కడ నివసించే ప్రజలకు అన్ని ప్రాథమిక సౌకర్యాలు, జీవనోపాధి అవకాశాలు లభించాలి. ‘వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్’ వలసలను తిప్పికొట్టడంలో సహాయపడింది. సరిహద్దులోని దాదాపు 40 గ్రామాలకు ప్రజలు తిరిగి రావడంతో అక్కడ జనాభా పెరిగింది.” అని అమిత్ షా పేర్కొన్నారు.