పాకిస్థాన్‌పై బ్యాన్..!!??.

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో మొండికేస్తున్న పాక్‌ను బ్యాన్ చేయాలని ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు (ఐసీసీ) డిసైడ్ అయిందని తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోవాల్సిందిగా కోరినా అందుకు పాక్ బోర్డు నో చెప్పడంతో ఐసీసీ పెద్దలు సీరియస్‌ అయ్యారట. దానికి తోడు తమ దేశంలో నిర్వహించాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీని సౌతాఫ్రికాకు తరలించే దిశగా ప్లానింగ్స్ నడుస్తుండటంతో ఆ టోర్నీలో ఆడొద్దని దాయాది దేశం భావిస్తోందట. ఇప్పటికే పాక్ మీద గుర్రుగా ఉన్న ఐసీసీ.. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీలో గనుక ఆ జట్టు ఆడకపోతే బ్యాన్ చేయాలని చూస్తోందట. దీంతో పాక్ చేజేతులా చేసుకుందని.. అనవసరంగా ఓవరాక్షన్ చేసి ఇరుక్కుపోయిందని అంటున్నారు.

యాక్షన్.. రియాక్షన్

భద్రతా కారణాల రీత్యా టీమిండియాను పాకిస్థాన్‌కు పంపేందుకు భారత ప్రభుత్వం నో చెప్పింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని, తమ మ్యాచుల్ని యూఏఈకి షిఫ్ట్ చేయాలని ఐసీసీని బీసీసీఐ కోరింది. అయితే పాక్ బోర్డు మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదు. టీమిండియా తమ దేశానికి రావాల్సిందేనని పట్టుబడుతోంది. ఒకవేళ తమ దేశానికి రాకపోయినా, హైబ్రిడ్ మోడల్‌లో మ్యాచులు ఆడితే ఊరుకోబోమని హెచ్చరిస్తోంది. ఇక మీదట ఐసీసీ టోర్నీల్లో మెన్ ఇన్ బ్లూతో మ్యాచుల్లో ఆడబోమని, టీమిండియా మ్యాచుల్ని బహిష్కరిస్తామని వార్నింగ్ ఇస్తోంది. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీని తరలిస్తే ఆ టోర్నీలో ఆడబోమని ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇస్తోంది. దీంతో ఆ టీమ్ ఆ దిశగా ఒక్క అడుగు వేసినా కొన్నాళ్ల పాటు బ్యాన్ విధించాలని ఐసీసీ భావిస్తోందట. ఈ వివాదం ఎప్పటికి చల్లారుతుందో చూడాలి..