తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా భారీ విజయం. !

తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాకు 534 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించగా, నాలుగో రోజైన నేడు ఆస్ట్రేలియా జట్టు 10 వికెట్లు కోల్పోయి 238 పరుగులు మాత్రమే చేసింది..దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 150 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ 8 వికెట్లకు 487 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఆస్ట్రేలియా 238 పరుగులకే కుప్పకూలింది…

అహంకారం పై గెలుపు..!

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా, మహ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2, నితీష్ రెడ్డి ఒక వికెట్ తీశారు. ట్రావిస్ హెడ్ (89) అర్ధ సెంచరీతో రాణించాడు. టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ లేకున్నా కూడా ఈ మ్యాచ్ గెలవడం విశేషం. 2021లో గబ్బాలో ఆస్ట్రేలియా గర్వాన్ని బద్దలు కొట్టిన భారత్, ఇప్పుడు పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియా గర్వాన్ని మళ్లీ బద్దలు కొట్టింది. ఈ టెస్టుకు ముందు పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియా నాలుగు టెస్టులు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింది..

టీమిండియా కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా కీలక వ్యాఖ్యలు..

టీమిండియా కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను 2018లో ఆడిన పెర్త్ పిచ్‌తో పోలిస్తే ఈ సారి పెర్త్ వికెట్‌లో ఘాటు తగ్గిందని అన్నాడు.

”సిరీస్‌ను చక్కగా ఆరంభించడం సంతోషంగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఒత్తిడికి గురైన తర్వాత గొప్పగా పుంజుకున్న తీరు పట్ల గర్వపడుతున్నాను. 2018లో పెర్త్‌లో ఆడినప్పుడు వికెట్ తొలుత సాఫ్ట్‌గా ఉంది. ఆ తర్వాత వేగంగా-వేగంగా మారిపోయింది. ఆ అనుభవంతో పోలిస్తే ఈ వికెట్ కాస్త ఘాటు తగ్గింది. ప్రక్రియ, సామర్థ్యంపైనే నేను నమ్ముతాను. అనుభవం ఎంతో ముఖ్యం. అదే ఆటలో భిన్నంగా చేయడానికి సాయపడుతుంది”

”ఇక జైస్వాల్ టెస్టు కెరీర్‌ను గొప్పగా ఆరంభించాడు. అతని కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా భావిస్తున్నా. అతను బంతిని వదిలేయడం, సందర్భాన్ని బట్టి ఎటాకింగ్ గేమ్ ఆడటం బాగుంది. విరాట్ కోహ్లి గురించి మాట్లాడాలంటే.. అతను ఫామ్ కోల్పోయాడనేది ఉండదు. సవాలైన వికెట్లపై ఓ బ్యాటర్ ఫామ్‌ను అంచనా వేయలేం. అతను నెట్స్‌లో మంచి లయతో ఉన్నాడు” అని బుమ్రా పేర్కొన్నాడు..

పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానం..!

ప్రస్తుతం డబ్ల్యూటీసీ టేబుల్‌లో భారత్‌ 61.11 శాతం సాధించింది. ఇప్పటి వరకు 15 టెస్టులు ఆడిన టీమ్‌ఇండియా 9 మ్యాచుల్లో గెలిచింది. ఐదింట్లో ఓడిపోయింది. ఒకటి డ్రాగా ముగిసింది. మొత్తం 98 పాయింట్లు భారత్‌ ఖాతాలో ఉన్నాయి. ఇక రెండో స్థానంలో ఉన్న ఆసీస్ 57.69 శాతంతో కొనసాగుతోంది. మొత్తం 13 మ్యాచుల్లో 8 విజయాలు, నాలుగు ఓటములను చవిచూసింది. ఈ మ్యాచ్‌ ముందు వరకు ఆసీస్‌ (62.50 శాతం), భారత్ (58.33 శాతం) తొలి రెండు స్థానాల్లో ఉండేవి. ఇప్పుడు తారుమారు కావడం విశేషం. ఈ పట్టికలో శ్రీలంక (55.56), న్యూజిలాండ్‌ (54.55) దక్షిణాఫ్రికా (54.17) టాప్‌-5లో ఉన్నాయి.