తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులపై దృష్టి సారించింది. ఏడాదిలోపు మూడు విడతలుగా రైతుల రుణమాఫీ చేసిన ప్రభుత్వం, ఈసారి నాలుగో విడతకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో మూడు లక్షల మందికి రుణమాఫీ చేయనుంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన శనివారం కీలక ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్రెడ్డి..ఈ ఏడాది తెలంగాణ రైతులకు స్వర్ణయుగమనే చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో రైతులందరికీ రుణమాఫీ చేసిన ఘనత సొంతం చేసుకుంది. ఇందిరమ్మ రాజ్యమంటే మాటలు కాదు చేతులతో చేసి నిరూపించింది.
రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు విడతలుగా రైతులకు రుణమాఫీ చేసింది. తొలి విడత 11 లక్షల 34 వేల 412 మందికి లక్ష వరకు రుణమాఫీ చేసింది. రెండో విడతలో మరో ఆరున్నర లక్షల మందికి లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేసింది. మూడో విడతలో నాలుగున్నర లక్షల మందికి 2 లక్షల వరకు చేసింది.
శనివారం నాలుగో విడతగా మూడు లక్షల మంది రైతులకు 3 వేల కోట్ల రూపాయలను విడుదల చేయనుంది ప్రభుత్వం. వీరిలో చాలామందికి రేషన్ కార్డు లేకపోవడం, బ్యాంకు ఖాతాల సమస్య, ఆధార్ కార్డుల్లో సమస్యలు, ఇతర సాంకేతిక సమస్యలతో మరో మూడు లక్షల మందికి రుణమాఫీ జరగలేదని గురించారు అధికారులు..