కేసీఆర్‌ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం… కేటిఆర్..

హైదరాబాద్: మూర్తీభవించిన స్త్రీగా తెలంగాణ తల్లిని కేసీఆర్‌ రూపొందించారని, ఆయన మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే చరిత్ర క్షమించదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నాడు ఇందిరాగాంధీ ప్రతిష్ఠించిన భరతమాత రూపాన్ని వాజ్‌పేయీ అధికారంలోకి రాగానే మార్చలేదు. దేశంలో ఎన్నోచోట్ల అధికార మార్పిడి జరిగింది. తెలుగుతల్లి విగ్రహ రూపం మారలేదు. కన్నడమాత విగ్రహం రూపు మారలేదు. కానీ, ఈ ముఖ్యమంత్రి.. కేసీఆర్‌ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నాలుగేళ్ల తర్వాత రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టిన స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం. అధికారం ఉందని సాయుధ బలగాల నడుమ మీ నాటకాలు కొంతకాలం సాగుతాయి. కానీ, ఎల్లకాలం ఇదే పరిస్థితి ఉండదు’’ అని కేటీఆర్‌ హెచ్చరించారు.