లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

*🔹నేడు తెలంగాణ అసెంబ్లీలో నాలుగు ప్రభుత్వ బిల్లులు*

భూభారతి బిల్లుపై చర్చ కొనసాగింపు..

తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు.

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ బిల్లు,

తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులను ప్రవేశపట్టనున్న ప్రభుత్వం..

నేడు అసెంబ్లీలో రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చ..

ప్రభుత్వ అప్పులు, చెల్లింపులపై చర్చ.. రైతు భరోసాపై చర్చ…

*🔹జమ్మూకశ్మీర్‌ కుల్గాంలో భారీ ఎన్‌కౌంటర్*

ఐదుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన బలగాలు..

మరో ఇద్దరిని ప్రాణాలతో పట్టుకున్న సైన్యం..

కద్దేర్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల జాడపై సైన్యానికి పక్కా సమాచారం.. టెర్రరిస్టులు దాక్కున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపిన సైన్యం…

*🔹పెళ్ళైన 20 రోజులకే.. సింగర్ శృతి ఆత్మహత్య.*

పెళ్ళైన 20 రోజులకే.. సింగర్ శృతి ఆత్మహత్య
*తెలంగాణ : జానపద పాటలతో ఫేమస్ అయిన సింగర్ శృతి మృతి చెందారు.* పెళ్ళైన 20 రోజులకే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇన్ స్టాలో పరిచయమైన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడితో శృతి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత భర్త, అత్తమామలు కట్నం కోసం ఆమెను వేధించారు. వేధింపులు తాళలేక శృతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు…

*ఎస్బీఐలో 13732 ఉద్యోగాలు*

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లో 13735 క్లర్క్ (జూనియర్ అసోసియేట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ సర్కిల్లో 342 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై త‌మిళ‌ న‌టుడు విజ‌య్‌ విమ‌ర్శ‌.. కొంత‌మందికి అంబేద్క‌ర్ పేరు అంటే గిట్ట‌దంటూ ట్వీట్‌!

ఇటీవల అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం

అంబేద్కర్ పేరును పదే పదే చెప్పుకునే ఫ్యాషన్ ఇప్పుడు ఉందన్న అమిత్ షా

ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌డుతూ టీవీకే అధ్యక్షుడు విజ‌య్ ట్వీట్‌

ఇటీవల పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత‌ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తమిళ సూపర్ స్టార్, తమిళగ వెట్రి కళ‌గం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ విమర్శలు గుప్పించారు. కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే అలెర్జీ అని విమ‌ర్శించారు. ఇంకా చెప్పాలంటే గిట్ట‌దు అని అన్నారు. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో విజయ్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఓ పోస్టు చేశారు.

అంబేద్కర్ భారత పౌరులందరికీ స్వాతంత్ర్య స్ఫూర్తిని ర‌గిలించిన సాటిలేని రాజకీయ మేధావి అని విజ‌య్‌ కొనియాడారు. అంబేద్కర్ వారసత్వం అట్టడుగు వర్గాలకు ఆశాజ్యోతి అని, సామాజిక అన్యాయానికి, వ్యతిరేక ప్రతిఘటనకు ప్రతీక అని విజయ్ పేర్కొన్నారు.

ఆయ‌న‌ పట్ల తనకున్న ప్రగాఢ అభిమానాన్ని నొక్కి చెబుతూ, నిరంతరం అంబేద్కర్ నామాన్ని జపిస్తానని ఈ సంద‌ర్భంగా విజ‌య్ అన్నారు. “అంబేద్కర్.. అంబేద్కర్.. అంబేద్కర్.. మన హృదయాలలో, మన పెదవులపై ఆనందంతో ఆయన నామాన్ని జపించుదాం” అని టీవీకే అధ్యక్షుడు పిలుపునిచ్చారు.

ఇక ఉత్తర తమిళనాడులోని విక్రవాండిలో తన పార్టీ మొదటి ర్యాలీ సందర్భంగా టీవీకే సైద్ధాంతిక గురువులలో అంబేద్కర్‌ను విజయ్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఈ ప్రాంతం గణనీయమైన దళిత జనాభాను కలిగి ఉంది. అలాగే విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) అధ్యక్షుడు తిరుమావళవన్ థోల్ కంచు కోటగా పరిగణించబడుతుంది. తిరుమావళవన్ స్థాపించిన వీసీకేని గతంలో దళిత్ పాంథర్స్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు.

కాగా, డిసెంబర్ 17న రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను దేశవ్యాప్తంగా విపక్షాలు కూడా తీవ్రంగా ఖండించాయి. అంబేద్కర్ పేరును పదే పదే చెప్పుకునే ఫ్యాషన్ ఇప్పుడు ఉందని, ప్రతిపక్షాలు తరచూ దేవుడి పేరు జ‌పిస్తే స్వర్గానికి చేరుకునేవారని ఆయ‌న‌ అన్నారు. దీంతో అమిత్ షా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

హోటల్లో ఎంజాయ్ చేశాడు.. బిల్లు కట్టకుండా ఊడయించాడు..

ఫైవ్ స్టార్ హోటల్‌కు 2 లక్షల బిల్లు ఎగ్గొట్టిన కస్టమర్

చాలా మంది ఎక్కడికైనా యాత్రలకు వెళ్తే.. వాళ్ల స్థాయికి తగ్గట్లుగా హోటళ్లను బుక్ చేసుకుంటారు. అందరికీ ఫైవ్ స్టార్ హోటళ్లలోనే ఉండాలని ఉన్నా వాళ్ల ఆర్థిక స్థోమత కారణంంగా చిన్న చిన్న హోటళ్లలో బస చేస్తుంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం తన వద్ద డబ్బులు ఎక్కువగా లేకపోయినా ఫైవ్ స్టార్ హోటళ్లో ఉండాలనుకున్నాడు. ఉన్నాడు కూడా. 4 రోజుల పాటు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ అన్నీ తిన్నాడు. 2 లక్షల బిల్లు కాగానే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అయితే అతనేం చెప్పి హోటల్ నుంచి వెళ్లిపోయాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఒడిశాకు చెందిన సార్థక్ సంజయ్ అనే వ్యక్తి.. వారణాసికి వెళ్లాడు. నవంబర్ 14వ తేదీన అక్కడే ఉన్న ఓ ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ గంగాస్‌కు వెళ్లి.. ఓ లగ్జరీ రూమ్‌ను బుక్ చేసుకున్నాడు. ఆపై తాళాలు తీసుకుని వెళ్లి హోటళ్లో బస చేశాడు. మొత్తం నాలుగు రోజుల పాటు హోటళ్లోనే గడిపిన సార్థక్ సంజయ్.. ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. తనకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ పెట్టుకుని మరీ లొట్టలేసుకుంటూ తినేశాడు. ఇలా తాను 4 రోజులకు హోటల్ బుక్ చేసుకోగా.. ఆయన వచ్చిన సమయం అయిపోయింది.

దీంతో హోటల్ యాజమాన్యం చెక్ అవుట్ గురించి సార్థక్ సంజయ్‌ను ఆరా తీశారు. మొత్తం బిల్లు 2.04 లక్షలు అయినట్లు వివరించారు. అయితే నవంబర్ 18వ తేదీ రోజు సాయంత్రంలోగా తాను చెక్ అవుట్ చేస్తానని చెప్పగా.. సిబ్బంది లేదు ఉదయం 11 గంటలకే మీరు వెళ్లిపోవాలని చెప్పారు. ఎందుకంటే ఆయన చెక్ ఇన్ అయింది అదే సమయంలో కాబట్టి. కానీ సాయంత్రం వరకూ హోటల్లోనే ఉండాలనుకున్న సార్థక్ సంజయ్.. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లిపోతానని చెప్పాడు. అయితే ఎక్కువ సేపు ఉన్నందుకు గాను మరిన్ని డబ్బులు తీసుకోవద్దని సిబ్బందిని కోరాడు. దానికి వాళ్లు కూడా ఒప్పుకున్నారు.

అయితే ఈ ఘటన జరిగిన ఓ అరగంట తర్వాత సార్థక్ సంజయ్.. తన గదిలోంచి బయటకు వచ్చి తాను ఓ సందర్శన కోసం బయటకు వెళ్తున్నట్లు చెప్పి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయాడు. మధ్యాహ్నం 3 గంటలు అవుతున్నా అతడు తిరిగి రాకపోవడంతో హోటల్ సిబ్బంది సంజయ్‌కు ఫోన్ చేశారు. ఎంత చేసినా ఫోన్ కలవకపోవడంతో ఆయన ఇచ్చిన మరో నెంబర్ కు ట్రై చేశారు. అది కూడా స్విచ్ఛాఫ్ అని రావడంతో ఒకరోజు వేచి చూశారు. మరుసటి రోజు కూడా రాకపోవడంతో ఇదే విషయాన్ని హోటల్ సిబ్బంది జనరల్ మేనేజర్‌కు చెప్పారు..దీంతో మేనేజర్ ఆయన గదిలోకి వెళ్లి ఏమైం ఉన్నాయేమోనని చెక్ చేయగా.. కొన్ని జతల బట్టలు మాత్రమే లభించాయి. దీంతో సంజయ్ తమను మోసం చేసినట్లు గుర్తించిన హోటల్ నిర్వాహకులు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హోటల్ సిబ్బంది నుంచి సంజయ్ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా సేకరించిన పోలీసులు ఆయనను వెతికే పనిలో పడ్డారు…

భారత సరిహద్దుల్లో చైనా ఘర్షణ పెంచే చర్యలు..!

భారత సరిహద్దుల్లో చైనా ఘర్షణ పెంచే చర్యలకు పాల్పడుతోంది. డోక్లాం సమీపంలో జోరుగా ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తూ కవ్విస్తోంది. గత ఎనిమిదేళ్ల నుంచి చూస్తే ఇప్పటి వరకు ఆ వ్యూహాత్మక సరిహద్దు ప్రాంతానికి సమీపంలో 22 గ్రామాలు, జనావాసాలను ఏర్పాటు చేసింది. 2020 నుంచి ఇప్పటి వరకు అక్కడ 8 గ్రామాలు నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ గ్రామాలను డోక్లాం సమీపంలో భూటాన్‌ భూభాగంలోని పశ్చిమ ప్రాంతంలో కడుతున్న చైనా.. ఆ భూమి తమదేనంటూ చెప్పుకుంటోంది. ఈ గ్రామాలు భూటాన్‌ పశ్చిమ భాగంలోనే ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, 2017లో డోక్లాం సరిహద్దులో చైనా రోడ్డు నిర్మిస్తున్న సమయంలో భారత్‌ అడ్డుకుంది. అప్పుడు ఇరు పక్షాల మధ్య ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ వ్యూహాత్మక పీఠభూమిలో భారత్‌ సరిహద్దువైపు చొచ్చుకురావడానికి చైనా ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగా భూటాన్‌ భూగాన్ని ఆక్రమించి గ్రామాలు నిర్మిస్తూ తన ప్రజలను అక్కడకి తరలిస్తోంది…

*🔹ఢిల్లీలో తీవ్ర కాలుష్యం, పొగమంచు*

*500 మీటర్లకు పడిపోయిన విజిబిలిటీ*
*సివియర్‌ ప్లస్‌ కేటగిరిలో వాయుకాలుష్యం*

కాలుష్య నియంత్రణకు GRAP-4 చర్యలు
448 పాయింట్లుగా ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌
ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బయటకు వెళ్లొద్దని సూచన..

తెలంగాణ టెట్ (TG TET) పరీక్షల షెడ్యూల్‌.!

తెలంగాణ టెట్ (TG TET) పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ (Telangana schools education ) డైరెక్టర్ విడుదల చేశారు. 2025 జనవరి 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. 8, 9, 10, 18 తేదీల్లో పేపర్-1 పరీక్షలను, జనవరి 2, 5, 11, 12, 19, 20వ తేదీల్లో పేపర్-2 నిర్వహించనున్నారు. ఈ సారి టెట్ పేపర్1, పేపర్2కి కలిపి మొత్తం 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు..

యువతిని చంపిన చిరుత..

తమిళనాడు: వేలూరు జిల్లాలో యువతిని చంపిన చిరుత పులి.. అడవిలో కట్టెలు తీసుకొస్తుండగా యువతిపై దాడి చేసి చంపిన పులి.. చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేసిన అటవీ అధికారులు.. యువతి మృతితో భయాందోళనలో పరిసర గ్రామాల ప్రజలు.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ భేటీ..

హైదరాబాద్‌: అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ భేటీ.. గంట ముందుగానే అసెంబ్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలకాంశాలపై సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం.. ఇవాళ అసెంబ్లీలో భూ భారతి, రైతు భరోసాపై చర్చ..

ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం..!

అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం.. 43వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ.24,276 కోట్ల విడుదలకు ఆమోద తెలపనున్న ఏపీ కేబినెట్.. పీడీఎస్‌ రైస్‌ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్న కేబినెట్.. సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై చర్చించనున్న కేబినెట్.. పెట్టుబడుల అంశంపై చర్చించనున్న ఏపీ మంత్రివర్గం..

సీఎం ప్రకటనలకే దిక్కులేదు..

ఆయన చెప్పింది ఏ ఒక్కటీ అమలు కావట్లేదు : మీడియాతో ఇష్టాగోష్టిలో మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసే ప్రకటనలకే దిక్కు లేకుండా పోయిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఆయన చెప్పింది ఏ ఒక్కటీ అమలు కావటం లేదని విమర్శించారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రంలోని 3.13 లక్షల మంది రైతులకు రూ.2,474 కోట్ల రుణమాఫీ చేస్తున్నామంటూ నవంబరు 30న సీఎం రేవంత్‌ చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇంతవరకూ రైతుల ఖాతాల్లో ఆ డబ్బు జమ కాలేదని విమర్శించారు. ఆ చెక్కు కూడా బౌన్స్‌ అయినట్టేనని వ్యాఖ్యానించారు. స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో డబ్బులేస్తామంటూ వరంగల్‌లో సీఎం చెప్పినా, ఇప్పటి వరకూ అది అమలు కాలేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఫిబ్రవరిలో ఇస్తామన్న పీఆర్సీ బకాయిల చెక్‌ (రూ.281 కోట్లు) కూడా వారి ఖాతాల్లో జమ కాలేదని విమర్శించారు. దీంతో ఆర్టీసీ సంస్థే మళ్లీ కార్మికుల ఖాతాల్లో డబ్బును జమ చేసిందని అన్నారు. మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను ఇస్తామన్న మాట పెద్ద బోగస్‌ అని తేలిపోయిందని దుయ్యబట్టారు. 2015లో తమ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఇచ్చిందనీ, ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కారు కూడా దాన్నే కొనసాగిస్తోందనీ, మిగతా వాటికి వడ్డీ కట్టాల్సిందేనని తెలిపారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు రేవంత్‌ సర్కార్‌ తులం బంగారం ఇవ్వలేదు, యువతులకు స్కూటీలు ఇవ్వలేదు, న్యూట్రీషన్‌ కిట్టూ లేదు, బతుకమ్మ చీరెలూ ఇవ్వలేదని వాపోయారు. మరోవైపు శాసనసభను ప్రభుత్వం రూల్స్‌ ప్రకారం నడపటం లేదని హరీశ్‌ విమర్శించారు. గతంలో భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు ఎలాంటి ఫ్లకార్డులు పట్టుకోలేదా? అని ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రియాంకాగాంధీ రోజుకో బ్యాగు వేసుకోవచ్చు, రాహుల్‌గాంధీ రోజూ టీ షర్ట్‌ వేసుకుని రావచ్చు, మేం మాత్రం అలా చేస్తా తప్పా? అని నిలదీశారు…

*ఎస్బిఐ ఎండీగా తెలుగు వ్యక్తి రామ మోహన్ రావు*

బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ ఎండీగా తెలుగు వ్యక్తి రామ మోహన్ రావును నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎస్బిఐ డిప్యూటీ ఎండీగా ఉన్న ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నట్లు నోటిఫికేషన్ జారీ అయింది. సంస్థ ప్రస్తుత ఛైర్మన్ సీఎస్ శెట్టి కూడా తెలుగు వారే. రామ మోహన్ రావు ఎండీగా బాధ్యతలు స్వీకరిస్తే ఎస్బిఐ చరిత్రలో ఒకేసారి 2 కీలక పదవులను తెలుగువారు అధిష్ఠించినట్లు అవుతుంది…

పార్లమెంటు వెలుపల బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీ నిరసనలు..

రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టిన కాంగ్రెస్‌..

ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌..

నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక తదితరులు..

కాంగ్రెస్‌ పార్టీనే అంబేడ్కర్‌ను అవమానించిందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీల నిరసన..

*సముద్రంలో ఫెర్రీని ఢీకొట్టిన స్పీడ్ బోటు*

ముంబైకి సమీపంగా అరేబియా సముద్రంలో జరిగిన పడవ ప్రమాద లైవ్ దృశ్యాలు బయటకు వచ్చాయి. గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా దీవులకు పర్యాటకులతో వెళ్తున్న ఫెర్రీని స్పీడ్ బోటు వేగంగా ఢీకొట్టింది. దీంతో ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది.

ఈ ఘోర ప్రమాదంలో .. 13 మంది మృతి

ముంబై బోట్ ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. మృతుల్లో ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నారని, 101 మందిని కాపాడినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు పర్యాటకులతో వెళ్తున్న ఫెర్రీ బోట్ను నేవీకి చెందిన స్పీడ్ బోటు వేగంగా ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.

పడవ ప్రమాదం.. మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం

ముంబై పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ₹2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ₹50,000 చొప్పున ఇవ్వనున్నట్లు PMO తెలిపింది. ఫెర్రీ బోట్ను నేవీ స్పీడ్ బోటు వేగంగా ఢీకొట్టడంతో 13 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.