లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

మహా కుంభమేళా ప్రారంభం..ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక..

Maha Kumbh Mela 2025 : ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ఘనంగా ఆరంభమైంది. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ ప్రదేశమైన ఉత్తర్ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకొని పవిత్ర స్నానాలు చేస్తున్నారు. భక్తుల పూజలతో ఈ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఉదయం 7.30 గంటల సమయానికే దాదాపు 35 లక్షల మంది ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించారని ప్రయాగ్‌రాజ్‌ అధికారులు వెల్లడించారు.

దేశవిదేశాల నుంచి తరలివస్తున్న భక్తులు
45 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు, పర్యటకులు వస్తున్నారు. సుమారుగా 35 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నదిలో నిరంతరం పహారా కాసేందుకు ప్రత్యేకంగా తేలియాడే పోలీసుస్టేషన్‌ను ఏర్పాటుచేశారు. అటు చిన్నచిన్న పడవలపై భద్రతా సిబ్బంది పెట్రోలింగ్‌ చేస్తున్నారు..

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు .

హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని ఓక టివి ఛానల్ఆఫీసులో కౌశిక్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వెళ్తున్న సమయంలో ఆయనను కరీంనగర్‌ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. కౌశిక్‌రెడ్డిని పోలీసులు కరీంనగర్‌కు తరలించారు..ఆదివారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న కౌశిక్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ గొడవపడ్డ విషయం తెలిసిందే. సంజయ్‌ను ఉద్దేశించి కౌశిక్‌రెడ్డి చేసిన కామెంట్ల వల్ల వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమక్షంలోనే ఈ గొడవ జరిగింది.

అనంతరం.. కౌశిక్‌రెడ్డిపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు సంజయ్‌ ఫిర్యాదు చేశారు. తనపై కౌశిక్‌రెడ్డి దుర్భాషలాడారని సంజయ్‌ చెప్పారు. తాను ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న సమయంలో కౌశిక్‌ రెడ్డి అడ్డుకున్నారని తెలిపారు. కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు.

కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్లపై కాంగ్రెస్ పార్టీ నేతలు కరీంనగర్‌ త్రీ టౌన్‌ పీఎస్‌లోనూ ఫిర్యాదు చేశారు. గేమ్‌ ఛేంజర్‌ టికెట్ల ధరలను పెంచడంతో సీఎం రేవంత్‌ రెడ్డిపై కౌశిక్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు..

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం.. కేటిఆర్..

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌లో ఈ అరెస్ట్‌ను ఖండించారు..పూటకో అక్రమ కేసు పెట్టడం.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టు చేయడం రేవంత్ సర్కారుకు ఓ అలవాటుగా మారింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారు..ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టు చేయడం పూర్తిగా అప్రజాస్వామికం. హుజూరాబాద్ నియోజకవర్గంలో రైతురుణమాఫీని ఎగ్గొట్టి, దళితబంధుకు పాతరేసిన కాంగ్రెస్ సర్కారును ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకే ముఖ్యమంత్రి ఈ అణచివేత చర్యలకు దిగుతున్నారు.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సీఎం రేవంత్ రెడ్డిపై చర్య తీసుకోవాల్సిందిపోయి ప్రజల పక్షాన ప్రశ్నించిన కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా? పోరాటాలే ఊపిరిగా పుట్టిన గులాబీ పార్టీ నేతల ఆత్మస్థైర్యాన్ని ఇలాంటి చిల్లర చేష్టలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ దెబ్బతీయలేదు. అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం” అని కేటీఆర్ అన్నారు…

ఒక రౌడీ షీటర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు కౌశిక్‌ రెడ్డిని అరెస్టు చేశారు..హరీశ్ రావు.

హరీశ్ రావు మాట్లడుతూ..… తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని అన్నారు. ఒక రౌడీ షీటర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు కౌశిక్‌ రెడ్డిని అరెస్టు చేశారని అన్నారు. పండుగ రోజు ఉద్దేశపూర్వకంగానే ఆయనను అరెస్టు చేశారని చెప్పారు.కాంగ్రెస్‌ సర్కారు పాలనలో తెలంగాణలో క్రైమ్‌ రేట్‌ 23 శాతం పెరిగిందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని తెలిపారు. ఒకే కేసులో కౌశిక్‌ రెడ్డిపై నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని అన్నారు..కాగా, కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు మొత్తం 35 మంది పోలీసులు వచ్చారు. కరీంనగర్‌ జిల్లా జడ్జి ఎదుట కౌశిక్‌ రెడ్డిని మొదట పోలీసులు హాజరుపరుస్తారు..

తిరుమలలో వరుస ప్రమాదాలు..

తిరుమల ఘాట్ రోడ్డులో రక్షణ గోడను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు…

ఇవాళ మధ్యాహ్నం తిరుమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పి, రక్షణ గోడను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..

భక్తులను తీసుకుని కొండపైకి వెళ్తుండగా ప్రమాదం..

ఈ ఘటనలో దాదాపు 10 మంది భక్తులకు గాయాలు కాగా ప్రమాదం అనంతరం ఆర్టీసీ బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో.. వెనుక వచ్చే వాహనాలు నిలిచిపోయాయి

దీంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది…..

తిరుమలలో మరో అపశృతి..తిరుమల లడ్డు కౌంటర్లో అగ్ని ప్రమాదం..

నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డు ప్రసాదాలను అందచేసే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు..

47 వ నెంబరు కౌంటర్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది..

కంప్యూటర్ సిస్టంకు సంబంధించిన యుపిఎస్ లో షార్ట్ సర్క్యూట్ రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు…

*ప్రారంభమైన హైదరాబాద్ కైట్ ఫెస్టివల్..*

* హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 3 రోజుల పాటు జరిగే కైట్ ఫెస్టివల్ ప్రారంభమైంది.
* ఈ వేడుకలకు 16 దేశాల నుంచి 47 మంది కైట్ ప్లేయర్లు, 14 రాష్ట్రాల నుంచి కైట్ క్లబ్ సభ్యులు హాజరవుతున్నారు.
* దీంతో పాటు స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను, తెలంగాణ పిండి వంటలు ఇక్కడి స్టాళ్లలో ప్రదర్శిస్తారు..

*పందెం గెలిస్తే విజేతలకు మహేంద్ర థార్..*

కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు. పందెం బరులు వద్దే గుండాట.

కరప పందెం బరి గెలిచిన వారికి మహేంద్ర థార్ ను గిఫ్ట్ గా ప్రకటించిన నిర్వాహకులు…

ఖమ్మం జిల్లాలో రేషన్ కార్డు రావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, రైతు భరోసా రావాలన్నా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతకం పెట్టాలి..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.…

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతకం పెట్టనిదే ఏది ఇవ్వొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అన్నారు ..

చాట్రాయి మండలంలో పలువురు టిడిపి నాయకులు రాజీనామా.

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం లో 200 మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి ఆదివారం రాత్రి రాజీనామా చేశారు. దీంతో చాట్రాయి మండలం నరసింహారావు పాలెం తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. గత 20 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని పార్టీ కోసం కష్టపడితే వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి నాయకులు పెద్దపీట వేస్తున్నారని ఆరోపణలు చేశారు. గ్రామ పార్టీ ప్రెసిడెంట్, అందేకృష్ణ. పార్టీ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేశారు…

నారావారిపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు, లోకేశ్.

ఆంధ్రప్రదేశ్ : సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. తిరుపతిలో జరిగిన కార్యక్రమాలను ముగించుకుని సంక్రాంతి పండగను కుటుంబంతో కలిసి స్వగ్రామంలో జరుపుకొనేందుకు ఆదివారం రాత్రి ఇక్కడికి వచ్చారు. సీఎం అందరినీ పేరు పెట్టి పిలుస్తూ ఆప్యాయంగా పలుకరించారు. ఇప్పటికే మంత్రి నారా లోకేశ్, భువనేశ్వరి నారావారిపల్లెకు చేరుకున్నారు. సీఎంకు స్వాగతం పలుకుతూ పచ్చని తోరణాలు, భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు..

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ జ‌మ్ము క‌శ్మీర్‌లో పర్యటన…

ఈ సంద‌ర్భంగా 2 వేల 700 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మించిన 6.4 కిలో మీట‌ర్ల పొడ‌వైన‌ సోనామార్గ్ సొరంగ మార్గాన్ని ప్ర‌ధాని ప్రారంభించారు.

అనంతరం.. పైక‌ప్పు లేని వాహనంలో ఈ మార్గంలో ప‌ర్య‌టించి ప‌రిశీలించారు.

ఇదేస‌మ‌యంలో ఈ సొరంగ మార్గం ప‌నుల్లో పాలుపంచుకొన్న కార్మికుల‌తో ప్ర‌ధాని సంభాషించి వారి అనుభ‌వాల‌ను తెలుసుకున్నారు..

ఈ కార్య‌క్ర‌మంలో జ‌మ్ము క‌శ్మీర్ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా స‌హా ఉన్న‌తాధికారులు పొల్గొన్నారు…

*రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతు భరోసా.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు*

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంక్రాంతి గొప్ప పండుగలా చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన నాలుగు కొత్త సంక్షేమ పథకాల అమలు సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఈ సంక్రాంతి నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి నాలుగు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తుందన్నారు. ఈ నాలుగు పథకాల అమలుకు సుమారు 40 నుంచి 45 వేల కోట్ల అధిక భారం పడుతుందన్నారు. ఎన్ని ఆర్టిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.

*రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతు భరోసా*

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 22,500 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు 2000 కోట్లు, రైతు భరోసా కు 19 వేల కోట్లు చొప్పున ఖర్చు చేసుకుంటూ ముందుకు పోతామన్నారు. ఈ నాలుగు కొత్త పథకాల అమల్లో ఎక్కడ ఎవరికి సందేహాలు అవసరం లేదన్నారు. లబ్ధిదారుల ఎంపిక, అమలుకు విధి విధానాలు లోతుగా చర్చించిన తర్వాతే రాష్ట్ర క్యాబినెట్ ప్రకటన చేసిందన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటినీకి పరిమితి లేకుండా ఎకరాకు సంవత్సరానికి 12 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. ఆర్‌ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా, వ్యవసాయ శాఖ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు తీసుకున్న కుటుంబం కనీసం 20 రోజులు పని చేసి ఉండి సెంటు భూమి కూడా లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అందుతుందని తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సైతం పూర్తిగా అర్హులనే ఎంపిక చేస్తామని అన్నారు. ఈ నెల నుంచి అమలు చేయబోయే నాలుగు కొత్త పథకాలకు గ్రామ సభలు ఏర్పాటు చేసి అందరికీ తెలిసే విధంగా పథకాలు అందజేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

*పథకాల అమలులో ఇందిరమ్మ కమిటీలది కీలకపాత్ర*

గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక, ఖరారు జరుగుతుందని, గ్రామసభల్లోని అర్హులైన వారికి పథకాల అనుమతి పత్రాలు అధికారులు, ప్రజా ప్రతినిధులు అందజేస్తారని తెలిపారు. ప్రభుత్వ జీవో ప్రకారం సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా లేదా అనేది ఇందిరమ్మ కమిటీలు పర్యవేక్షిస్తాయన్నారు. సంక్షేమ పథకాల అమలులో వీరు కీలకమని డిప్యూటీ సీఎం తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపు, అర్హుల జాబితా అన్నీ కూడా జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదం ఉండాల్సిందే అని తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల పేర్లు, వారు పొందిన నగదు మొత్తాన్ని అందరికీ కనిపించేలా పెద్ద అక్షరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, మొత్తం మూడు పథకాలకు సంబంధించి మూడు ఫ్లెక్సీలు, విడివిడిగా పెద్దగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకాల అమలులో కలెక్టర్లకు ఎలాంటి సందేహాలు ఎదురైనా జిల్లా ఇన్చార్జి మంత్రితో మాట్లాడి నివృత్తి చేసుకోవాలని సూచించారు..