ఇంగ్లాండ్‌పై 3-0 తేడాతో భారత్ విజయం ….!

ఐసీసీ ప్రపంచ టోర్నమెంట్‌కు ముందు ఇంగ్లాండ్‌పై 3-0 తేడాతో విజయం సాధించి భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహాలను ముగించింది. ఫిబ్రవరి 12 బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడవ మ్యాచ్‌లో షుబ్‌మాన్ గిల్ సెంచరీ, శ్రేయాస్ అయ్యర్ శక్తివంతమైన ఇన్నింగ్స్, విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ మరియు ఆల్ రౌండ్ బౌలింగ్ సహకారంతో మెన్ ఇన్ బ్లూ జట్టు ఇంగ్లాండ్‌పై రెండవ అతిపెద్ద వన్డే విజయాన్ని సాధించింది…

స్వదేశంలో ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ను టీమ్ఇండియా క్లీన్స్వీప్ చేసింది. మూడు వన్డేల్లో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత్ 142 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 357 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో ఇంగ్లాండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకే కుప్పకూలింది. టామ్ బంటన్ (38), గస్ అట్కిసన్ (38) మాత్రమే ఫర్వాలేదనిపించారు. భారత్ బౌలర్లలో అర్షదీప్, హర్షిత్ , హార్దిక్, అక్షర్ పటేల్ తలో 2, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

విరాట్ కమ్బ్యాక్..

విరాట్‌ ఎట్టకేలకు తన హాఫ్‌ సెంచరీతో విమర్శలకు సమాధానం ఇచ్చాడు. వన్డేల్లో అతడికి ఇది 73వ అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. బోర్డర్- గావస్కర్‌ ట్రోఫీ తర్వాత తాజా మ్యాచ్లో కోహ్లీ అద్భుతమైన టచ్‌లో కనిపించాడు. రెండో వికెట్‌కు గిల్‌తో కలిసి కీలకమైన 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫార్లు, 1 సిక్సు ఉంది.

సరైన సమయంలో
కీలకమైన ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు విరాట్ వైట్బాల్ ఫార్మాట్లో కమ్బ్యాక్ ఇవ్వడం భారత్కు శుభసూచికం. గత మ్యాచ్లో కెప్టెన్ సెంచరీతో అలరించగా, తాజాగా విరాట్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ సిరీస్తో సీనియర్లిద్దరూ టచ్లోకి రావడంతో టీమ్ఇండియా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ ఆనందం షేర్‌ చేసుకుంటున్నారు.

ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా కోహ్లీ ఇన్నింగ్స్‌ను ప్రశంసిస్తూ పోస్ట్‌ షేర్ చేసింది. ‘కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌లతో సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. ఓపెనర్‌ రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హాట్‌స్టార్ వ్యూవర్స్‌ సంఖ్య 80 లక్షలుగా ఉంది. కోహ్లీ వచ్చిన తర్వాత అకస్మాత్తుగా 1.9 కోట్లకు చేరుకుందని ఓ ఫ్యాన్‌ పోస్ట్‌ చేశాడు..