పాస్టర్ ప్రవీణ్ కుమార్ సీసీ కెమెరాలో

పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఓ మద్యం షాపు వద్ద ఆగి ఉన్న దృశ్యం..

పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల అనుమానాస్పద మృతికి సంబంధించి జరుగుతున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా మరో ఆధారం వెలుగులోకి వచ్చింది. హైద్రాబాద్ నుంచి రాజమండ్రికి బైక్ మీద వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయారు పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల అయితే, హైద్రాబాద్ నుంచి వెళుతూనే, హైద్రాబాద్ శివార్లలోనే ఓ మద్యం దుకాణంలో లిక్కర్ కొనుగోలు చేశారాయన. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. లిక్కర్ సేవిస్తూనే, ఆయన వాహనం నడిపారనీ, విజయవాడ సమీపంలో ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారని ఇప్పటికే పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఒకసారి కాదు, విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే పాస్టర్ ప్రవీణ్ కుమార్ రెండు సార్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఓ సారి ప్రమాదం జరిగినప్పుడు, ఆయనకు కొందరు సపర్యలు కూడా చేశారు. ఇంకోసారి ప్రమాదం జరిగినప్పుడు ఏకంగా ఓ పోలీస్ ఆయనకు సపర్యలు చేసినట్లు తెలుస్తోంది.

మూడోసారి రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ రాజమండ్రి సమీపంలో ప్రాణాలు కోల్పోయారు. ముందుగా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడే, పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల ప్రయాణించిన వాహనం దెబ్బ తింది. హెడ్ లైట్ ధ్వంసమైంది. ఇండికేటర్ల సాయంతోనే, సుదూరం ఆయన చీకట్లో ప్రయాణించడం గమనార్హం.
https://x.com/TeluguBulletin/status/1906952142113693756?t=oWPbFQbFlrFTkjg3buIEXA&s=19
కాగా, పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి చుట్టూ మత రాజకీయాలు జరుగుతున్న దరిమిలా, పోలీసులు అత్యంత జాగ్రత్తగా కేసు విచారణను కొనసాగిస్తున్నారు. హైద్రాబాద్ నుంచి రోడ్డు ప్రమాదం జరిగిన రాజమండ్రి వరకు, మార్గ మధ్యంలో వున్న ఆయా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని సేకరిస్తున్నారు. మద్యం షాపుల్లో ఆయన చేసిన పేమెంట్ల తాలూకు వివరాల్నీ సేకరించి, కేసు విచారణ ముందుకు తీసుకెళుతున్నారు..

తప్పుడు ప్రచారం చేస్తున్నవారు అరెస్టు..

ఎవరో చంపి వేశారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న అరెస్టు చేసిన పోలీసులు..
రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ మృతిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. రాజమండ్రి లలితా నగర్ ప్రాంత వాసి దేవబత్తుల నాగమల్లేష్ ని అరెస్ట్ చేసి పోలీసులు కోర్ట్ లో ప్రవేశ పెట్టారు. స్థానిక విఆర్ఓ పిర్యాదు మేరకు సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తున్న మల్లేష్ ని అరెస్ట్ చేసినట్లు రాజమండ్రి మూడవ పట్టణ పోలీసులు తెలిపారు. కోర్టులో ప్రవేశ పెట్టిన మల్లేష్ కు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో ఇలా తప్పుడు ప్రచారాలు చేసే వారికి పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ పంపారు..