నేటి పంచాంగం… నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☘️పంచాంగం☘️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 26 – 04 – 2025,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
చైత్ర మాసం,
బహుళ పక్షం,

తిథి : *త్రయోదశి* ఉ6.11 వరకు,
తదుపరి *చతుర్థశి* తె3.48 వరకు,
నక్షత్రం : *రేవతి* రా2.46 వరకు,
యోగం : *వైధృతి* ఉ6.58 వరకు,
తదుపరి *విష్కంభం* తె3.48 వరకు,
కరణం : *వణిజ* ఉ6.11 వరకు,
తదుపరి *భద్ర* సా5.00 వరకు,
ఆ తదుపరి *శకుని* తె3.48 వరకు,

వర్జ్యం : *మ3.32 – 5.02,*
దుర్ముహూర్తము : *ఉ5.41 – 7.21,*
అమృతకాలం : *రా12.31 – 2.01,*
రాహుకాలం : *ఉ9.00 – 10.30,*
యమగండం : *మ1.30 – 3.00,*
సూర్యరాశి : మేషం,
చంద్రరాశి : మీనం,
సూర్యోదయం : 5.41,
సూర్యాస్తమయం: 6.13,

*_నేటి విశేషం_*

*మాస శివరాత్రి*
*శనిత్రయోదశి…*
_శనీశ్వరుడి ప్రీత్యర్థం…. శని వక్రదృష్టిని పోగొట్టుకునేందుకు.. పూజలు జరిపే విశేషమైన రోజు శని త్రయోదశి!_
వారం.. తిథి కలయిక వల్ల వచ్చే విశేషపర్వం ఈ శనిత్రయోదశి.

ఏ నెలలో అయినా శుక్లపక్షం లేదా కృష్ణపక్షంలో శనివారం రోజు త్రయోదశి తిథి కలిసి వస్తే ఆ రోజున, శని త్రయోదశి జరుపుకోవడం ఆచారం.
అందులోనూ శనివారం సాయంత్రం సమయంలో త్రయోదశి ఉండటం విశిష్టమైనది.
అయితే ఉదయం పూట ఉన్నా శని త్రయోదశి జరుపుకోవచ్చు.
నవగ్రహాలలో ఏడవ గ్రహం శనైశ్చరుడు.

శనైశ్చరుడు అంటే అందరూ భయపడతారు, ఆయన దృష్టి తమపై సరిగా లేకుంటే కష్టాలు వస్తాయని, నష్టాలు జరుగుతాయని అందరూ భావిస్తుంటారు.
అయితే ఆయనలా వరాలను ప్రసాదించే గ్రహము మరేదీ లేదు.

శనైశ్చరుడు సూర్యభగవానుడు, ఛాయాదేవీల కుమారుడు, విశ్వకర్మ తన కూతురు సంజ్ఞాదేవిని సూర్యభగవానుడికిచ్చి వివాహం జరిపించాడు.
వారికి మనువు, యముడు, యమున అనే సంతానం కలిగింది.

సూర్యుడి వేడి భరించలేని ఆమె తన రూపంతో ఛాయాదేవిని సృష్టించి తన స్థానంలో ఆమెను ఉంచి తాను వెళ్ళిపోయి తపస్సు చేసుకోసాగింది.
సూర్యుడికి ఛాయాదేవిలకు శ్రుతశ్రవస్, శృతకర్మ అనే పుత్రులు, తపతి అనే పుత్రిక జన్మించారు.
అందులో శృతకర్మయే శనైశ్చరుడు, ఆయన మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రోజు జన్మించినట్లు పురాణాల్లో చెప్పబడింది.
శనైశ్చరుడు భూలోకం చేరి కాశీ క్షేత్రానికి వెళ్లి శివలింగాన్ని ప్రతిష్ఠించి నవగ్రహాల్లో స్థానం పొందాడు.

శనైశ్చరుడు నలుపు వర్ణంతో.. పొట్టిగా ఉంటాడు.
ఈయన వాదనలు కలుగజేసే గుణం కలిగిన వాడు.
దిక్కుల్లో పడమర, దేవతలలో యముడు, లోహాలలో ఇనుము, రాళ్ళల్లో నీలం, ధాన్యాలలో నువ్వులు, సమిధలలో జమ్మి, రుచుల్లో పులుపు, వస్త్రాల్లో నలుపురంగు శనైశ్చరుడికి ప్రియమైనవి.
ఆయన వాహనం కాకి, ఈ స్వామిని శనివారం నాడు ఆరాధించడం శ్రేష్టం.
అందుకు శనిత్రయోదశి మరింత ప్రశస్తమైనది.

*శని – స్తోత్ర ప్రియుడు*
శనైశ్చరుడు స్తోత్రప్రియుడు కాబట్టి, శని త్రయోదశి నాడు ఈ క్రింది శ్లోకాలను పారాయణం చేయడం మంచిది.

నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ కృష్ణాయ చ నమోస్తుతే

నమస్తే రౌద్ర దేహాయ నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే నారయే విభో
నమస్తే మందసంజ్ఞాయ శనైశ్చరాయ నమోస్తుతే
ప్రసాదం మమ దేవేశ దీనస్య ప్రణతస్యచ!!

నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం
ఛాయామార్తాండ సంభూతం
తం నమామి శనైశ్చరం

కాకధ్వజాయవిద్మహే
ఖడ్గహస్తాయ ధీమహి
తన్నో మందః ప్రచోదయాత్!!

వీటిని శనిత్రయోదశి నాడేకాక నిత్యం కూడా పఠించవచ్చు 🙏

ఈ విధంగా శనిత్రయోదశినాడు శనైశ్చరుని పూజించి, స్తోత్రం చేసి సమస్త బాధల నుండి ఉపశమనం పొందవచ్చు.

*శని త్రయోదశి నాడు ఏం చేయాలి?*
శనైశ్చరుడి అనుగ్రహం కోరుకుంటున్నవారు ఏలినాటి శని దశ, అష్టమశని, అర్ధాష్టమశని దశ నడుస్తున్నవారు, శని మహర్దశ, అంతర్దశలో ఉన్నవారితో పాటు అందరూ శనైశ్చరుడిని ప్రార్థించి, పూజించి ఉపశమనం పొందవచ్చు.
ప్రత్యేక శనైశ్చర ఆలయాల్లోగాని, లేదా నవగ్రహ మండపంలో ఉన్న శనైశ్చరస్వామికి తైలాభిషేకం చేసి నువ్వులను దానం చెయ్యాలి.
ముందు శివలింగాన్ని అభిషేకించి అర్చనలు చేసి ఆ తర్వాత శనైశ్చరుని ఆరాధిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి.
అంతేకాక ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించి, ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం ఉంటుంది.
శనైశ్చరుడికి ప్రియమైన ఇనుము, నీలం, మేకులు, నువ్వులు, నువ్వులనూనె, నల్లని వస్త్రాలు, బూరుగదూది వంటివి దానం చేయడం కూడా మంచిదే.
ఈనాడు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం, గోవులకు తెలకపిండిని పెట్టడం వల్ల కూడా చాలా ఉపశమనం కలుగుతుంది.

వీటన్నింటికి తోడు శనైశ్చరుడి ఆలయంలో నువ్వుల అన్నాన్ని నైవేద్యంగా సమర్పించడం, నల్ల ఆవు యొక్క పాలను అన్నంలో కలిపి దానిని శివుడికి నివేదించడం, నల్ల ఆవు పాలతో ప్రదోషంలో శివుడికి అభిషేకం చేయడం, శనైశ్చరుడి ముందు దీపపు ప్రమిదలో నల్లని నువ్వులు వేసి నువ్వులనూనెతో దీపాలు వెలిగించడం చేయాలి.

ఇవేవీ చేయలేకపోయినా ప్రతిరోజు భోజనానికి ముందు పిడికెడు అన్నాన్ని కాకికి పెట్టడం కూడా ఆయన అనుగ్రహం కలిగేలా చేస్తుంది.

*_☘️శుభమస్తు☘️_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏