ఉగ్రవాదులు దాడిలో మతం అడగలేదు..కర్ణాటక ఎక్సైజ్ మంత్రి ఆర్‌బీ తిమ్మాపూర్.. మరో వివాదాస్పద వ్యాఖ్యలు..

దాడికి పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా, హిందువుల్ని టార్గెట్ చేస్తూ ముష్కరులు టార్గెట్ చేయడాన్ని భారత సమాజం తీవ్రంగా ఖండిస్తోంది.

ఇదిలా ఉంటే, కొందరు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో యుద్ధం వద్దని చెప్పడం వివాదాస్పదమైంది. ఇప్పుడు ఆయన క్యాబినెట్‌లోని మంత్రి ఆర్‌బీ తిమ్మాపూర్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఉగ్రవాదులు దాడికి పాల్పడే ముందు వారి మతాన్ని అడిగారని నేను అనుకోవడం లేదని అన్నారు.

కర్ణాటక ఎక్సైజ్ మంత్రి ఆర్‌బీ తిమ్మాపూర్ మీడియాతో మాట్లాడుతూ.. కాల్చుతున్న వ్యక్తి కులం, మతం అడుగుతాడా..? అతను కాల్చి వెళ్లిపోతాడు, ఒకసారి సరిగా ఆలోచించండి. ఉగ్రవాది అక్కడ నిలబడి మతాన్ని అడగడు.” అని అన్నారు. ఈ దారుణమైన దాడిప దేశం కలత చెందుతోందని చెబుతూనే, దీనిని మతపరమైన సమస్యగా చిత్రీకరించడానికి కుట్ర జరుగుతోందని మంత్రి ఆరోపించాడు. ”వారు ఉగ్రవాద దాడి చేస్తున్నప్పుడు మతం అడిగలేదని నేను భావిస్తున్నాను. వారు అలా చేస్తే, మతం ఆధారంగా సమస్యను రాజకీయం కాకూడదు” అని మంత్రి చెప్పారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ తీవ్రంగా స్పందించారు. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి తిమ్మాపూర్ అనాగరికమైన, దుష్టమై వ్యాఖ్యలు బాధిత కుటుంబాల సమగ్రతను అవమానించాయని అన్నారు. ఇలాంటి సమయంలో కూడా మతపరమైన, తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మనస్సాక్షిని తాకట్టు పెట్టి, మతతత్వ కాంగ్రెస్ పార్టీ వ్యాపారం చేస్తుందని దుయ్యబట్టారు.