భారత్‌ను ఒప్పించాలంటూ అరబ్‌ దేశాలను ఆశ్రయిస్తున్న పాకిస్తాన్…ఉగ్రవేటలో మేం భారత్‌తోనే..

రాయబారులతో షరీఫ్‌ భేటీ

ఉగ్రవేటలో మేం భారత్‌తోనే

పాక్‌కు అమెరికా స్పష్టీకరణ

మీ గడ్డపై ముష్కరులు: వాన్స్‌

వారి వేటలో భారత్‌కు తోడ్పడండి

దాయాదికి ఉపాధ్యక్షుని హితవు

మాది ‘ఉగ్ర’చరిత్రే: బిలావల్‌

ఎనిమిదో రోజూ పాక్‌ కాల్పులు

భారత ‘పహల్గాం ప్రతీకార’ప్రయత్నాలు చూసి పాకిస్తాన్‌ బెదిరిపోతోంది. ఉద్రిక్తతలను ఎలాగైనా తగ్గించేలా భారత్‌ను ఒప్పించాలంటూ అరబ్‌ దేశాలను ఆశ్రయించింది. సౌదీ అరేబియా, యూఈఏ, కువైట్‌ తదితర దేశాలకు పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ శుక్రవారం ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పాక్‌లోని ఆ దేశాల రాయబారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దక్షిణాసియాలో సుస్థిరతనే కోరుతున్నామంటూ శాంతి వచనాలు వల్లెవేశారు. పహల్గాం దాడితో పాక్‌కు ఏ సంబంధమూ లేదంటూ పాతపాటే పాడారు.

పాక్‌లో చైనా రాయబారి జియాంగ్‌ జైడాంగ్‌తో కూడా షహబాజ్‌ భేటీ అయ్యారు. ఉగ్రవాదంపై పోరుతో భారత్‌కు తాము పూర్తిస్థాయిలో దన్నుగా నిలుస్తామని అమెరికా పునరుద్ఘాటించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి తమ పూర్తి మద్దతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్‌ స్పష్టం చేశారు. భారత్, పాక్‌ మధ్య నెలకొన్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఈ విషయమై నిర్ణాయక వ్యాఖ్యలు చేశారు. పాక్‌ భూభాగం నుంచి మారణకాండకు దిగుతున్న ఉగ్రవాదులను వెదికి పట్టుకోవడంలో భారత్‌కు సహకరించాలని దాయాదికి హితవు పలికారు.

”ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అవి రెండు అణుదేశాల ప్రాంతీయ యుద్ధంగా మారొద్దన్నదే మా ఉద్దేశం. ఏం జరుగుతుందో చూద్దాం”అని గురువారం ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. పహల్గాం దాడి సమయంలో వాన్స్‌ కుటుంబంతో పాటు భారత్‌లోనే ఉండటం తెలిసిందే. దాయాదుల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని బ్రిటన్‌ ఆకాంక్షించింది. పహల్గాం దాడిని హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ తీవ్రంగా ఖండించినట్టు పేర్కొంది. వాటిని నిరసిస్తూ బ్రిటన్‌లో కొద్ది రోజులుగా శాంతియుత ఆందోళనలు జరుగుతున్న వైనం కూడా సభలో చర్చకు వచ్చినట్టు పేర్కొంది.

అదేమీ రహస్యం కాదు: బిలావల్‌
పాక్‌ ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారడం నిజమేనని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ చైర్‌పర్సన్‌ బిలావల్‌ భుట్టో కూడా అంగీకరించారు. మూడు దశాబ్దాలుగా పాక్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ఇటీవల అంతర్జాతీయ మీడియా సాక్షిగా అంగీకరించడం తెలిసిందే. దీనిపై స్కై న్యూస్‌ ఇంటర్వ్యూలో బిలావల్‌ ఈ మేరకు స్పందించారు. రక్షణ మంత్రి వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అని ప్రశ్నించగా, ‘అది పెద్ద రహస్యమేమీ కాదు. పాక్‌ది ఉగ్రవాద గతమే”అంటూ పాక్‌ నిర్వాకాన్ని బాహాటంగా అంగీకరించారు. అయితే దానివల్ల దేశం ఎంతగానో నష్టపోయిందని వాపోయారు.

”ఉగ్రవాదం పాక్‌కే కాదు, అంతర్జాతీయ సమాజానికి కూడా పెనుబెడదగా పరిణమించింది. పాక్‌ దశలవారీగా ఉగ్రవాదానికి మద్దతిస్తూ వచ్చింది. మా సమాజం ఇస్లామీకరణ, సైనికీకరణ దశల గుండా సాగింది. వీటన్నింటివల్లా మేం నష్టపోతూ వచ్చాం. అయితే వాటినుంచి పాఠాలు నేర్చుకున్నాం. సింధూ పరివాహక నదులకు భారత్‌ నీరు వదలకుంటే రక్తం పారుతుందంటూ బిలావల్‌ ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తన ఉద్దేశం అది కాదని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు. ”నీటిని ఆపడాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని మా ప్రభుత్వమే చెప్పింది. యుద్ధం జరిగితే పారేది రక్తమేగా. అదే నేనూ చెప్పా”అన్నారు. మరోవైపు సింధూ జల ఒప్పందం నిలుపుదలను నిరసిస్తూ భారత్‌కు దౌత్య నోటీసులివ్వాలని పాక్‌ యోచిస్తోంది. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికల మీదా లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది.

హాకింగ్‌కు విఫలయత్నాలు
పాక్‌ ప్రేరేపిత హాకర్‌ గ్రూపులు భారత వెబ్‌సైట్లపై శుక్రవారం మరోసారి భారీగా సైబర్‌ దాడులకు దిగాయి. జమ్మూలోని ఆర్మీ స్కూల్స్, రిటైర్డ్‌ సైనికుల ఆరోగ్య సేవలు తదితరాలకు సంబంధించిన సైట్లను హాక్‌ చేసేందుకు విఫలయత్నం చేశాయి. సైబర్‌ గ్రూప్‌ హోక్స్‌1337, నేçషనల్‌ సైబర్‌ క్రూ పేరిట దాడులు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ”పాక్‌తో పాటు పలు పశ్చిమాసియా దేశాలు, ఇండొనేసియా, మొరాకో తదితర చోట్ల నుంచి ఈ సైబర్‌ దాడులు జరిగాయి. వాటికి పాల్పడ్డ పలు సంస్థలు ఇస్లామిక్‌ భావజాలానికి మద్దతు పలుకుతున్నట్టు చెప్పుకున్నాయి. వాటన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టాం”అని తెలిపాయి. పహల్గాం దాడి నుంచీ ఈ తరహా దాడులు విపరీతంగా పెరిగిపోయినట్టు వెల్లడించాయి. ఇదంతా పాక్‌ హైబ్రిడ్‌ యుద్ధతంత్రంలో భాగమని అనుమానిస్తున్నారు.

ఐదు సెక్ట్టర్లలో కాల్పులు
పాక్‌ వరుసగా ఎనిమిదో రోజు కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్‌లో ఐదు జిల్లాల వెంబడి నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గురువారం రాత్రి కూడా కాల్పులకు తెగబడింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషేరా, అఖూ్నర్‌ ప్రాంతాల్లో ఎలాంటి కవ్వింపులూ లేకుండానే పాక్‌ దళాలు తేలికపాటి ఆయుధాలతో కాల్పులకు దిగినట్టు సైన్యం అధికార ప్రతినిధి వెల్లడించారు. ”తొలుత ఉత్తర కశ్మీర్‌లో కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో మొదలైన కాల్పులు జమ్మూ ప్రాంతంలోని పూంచ్, అఖ్నూర్‌ సెక్టర్లకు విస్తరించాయి.

అనంతరం నౌషేరాలోని సుందర్బనీ, జమ్మూ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు గుండా పర్‌గ్వాల్‌ సెక్టర్లోనూ కాల్పులకు తెగబడ్డాయి. వాటిని భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది”అని తెలిపారు. ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షితంగా తలదాచుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన కమ్యూనిటీ, వ్యక్తిగత బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు.

కథువా, సాంబా, రాజౌరీ, పూంచ్‌ జిల్లాల్లో ఇంకా పంటకోతలు జరగాల్సి ఉంది. పాక్‌తో భారత్‌ 3,323 కి.మీ. మేరకు సరిహద్దును పంచుకుంటోంది. ఇందులో 2,400 కి.మీ. మేరకు అంతర్జాతీయ సరిహద్దు గుజరాత్‌ నుంచి జమ్మూ దాకా విస్తరించింది. 740 కి.మీ. నియంత్రణ రేఖ, యాక్చ్యువల్‌ గ్రౌండ్‌ పొజిషన్‌ లైన్‌ (ఏజీపీఎల్‌)తో పాటు మరో 110 కి.మీ. సియాచిన్‌ ప్రాంతంలో విస్తరించి ఉంది…

అన్ని దేశాలకు సైన్యం ఉంటుంది, కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం ఓ సైన్యానికి దేశం ఉందని చెప్పవచ్చు. భారత్ వంటి దేశాల్లో మిలిటరీ చీఫ్‌లుగా పని చేసిన వారు రిటైర్మెంట్ తర్వాత సాధాసీదా జీవితం గడుపుతారు..కానీ పాకిస్తాన్‌లో అలా కాదు మిలిటరీలో చేరితే జాక్‌పాట్ కొట్టినట్లు, ప్రభుత్వమే పదుల నుంచి వందల ఎకరాల భూమిని ఆర్మీలో పనిచేసిన వారికి ఇస్తుంది. ఇక అవినీతికి కొదువ లేదు. పాక్ ఆర్మీ చీఫ్‌లుగా పనిచేసినవారు తమ రిటైర్మెంట్ తర్వాత హాయిగా లండన్, దుబాయ్, ఖతార్‌ వంటి ప్రాంతాల్లో కుటుంబాలతో సెటిల్ అవుతారు. ఆ తర్వాత పాకిస్తాన్‌ వైపు కన్నెత్తి చూడరు.

పాకిస్తాన్ దేశ రక్షణ, యుద్ధం తప్పా అన్ని వ్యాపారాలు చేస్తోంది. పాకిస్తాన్ వ్యాప్తంగా మొత్తం వ్యాపార సామ్రాజ్యం పాక్ ఆర్మీ చేతిలోనే ఉంది. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వరకు పాక్ ఆర్మీదే రాజ్యం. చివరకు నిత్యావసర వస్తువుల్లో కూడా ఆర్మీ హస్తం ఉంటుంది. సిమెంట్, ఎరువులు, బ్యాంకింగ్, పాడి పరిశ్రమ, రవాణా, గృహ నిర్మాణం అంతా ఆర్మీ చేతిలోనే. ప్రస్తుతం, వార్తల్లో హాట్ టాపిక్‌గా ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ బహిరంగ ఆస్తులే రూ. 6 కోట్ల (ఇండియన్ రూపాయలు) ఉన్నాయి. ఇక విదేశాల్లో, బినామీల పేర్లలో ఎన్ని ఆస్తులు ఉన్నాయో లెక్కే లేదు. సూటిగా చెప్పాలంటే పాక్ ఆర్మీ ఆ దేశంలో 100కి పైగా వ్యాపారాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం వ్యవసాయంలోకి దిగింది. చోలిస్థాన్ ఎడారి ప్రాంతంలో పెద్ద కెనాల్‌లను నిర్మించి, సింధు నది నీటిలో వ్యవసాయం చేయాలనుకుంటోంది.

పాక్ ఆర్మీ వ్యాపార సామ్రాజ్యం:

పాకిస్తాన్ సైన్యం రక్షణతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగాన్ని నియంత్రిస్తుంది. నిజానికి ఇది ప్రజా ప్రభుత్వాన్నే శాసిస్తుంది. ఆర్మీ చెప్పిందే అక్కడి ప్రభుత్వాలకు వేదం. పాక్ ఆర్మీ ఫౌజీ ఫౌండేషన్, ఆర్మీ వెల్ఫేర్ ట్రస్ట్, షాహీన్ ఫౌండేషన్, బహ్రియా ఫౌండేషన్ వంటి సంస్థలను నిర్వహిస్తుంది. ఇది పెద్ద కార్పొరేట్ నెట్వర్క్.

ప్రసిద్ధ రచయిత్రి ఆయేషా సిద్ధిఖా రాసిన ”మిలిటరీ ఇంక్.: ఇన్‌సైడ్ పాకిస్తాన్స్ మిలిటరీ ఎకానమీ” పుస్తకంలో పాక్ వ్యాపార సామ్రాజ్యం గురించి అన్ని వివరాలు ఉన్నాయి. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ ప్రాంతాల్లో పాక్ ఆర్మీ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్నే స్థాపించింది. డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ (DHA) పేరుతో పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థను రన్ చేస్తోంది. దీని విలువ బిలియన్ డాలర్లలో ఉంది. అయేషా సిద్దిఖీ ప్రకారం, 2007లోనే పాకిస్తాన్ వ్యాపార దందా విలువ 20 బిలియన్ డాలర్లు. ఇప్పుడు దీని విలువ 40-100 బిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో రూ. 80,000 కోట్లు)గా ఉండొచ్చు..

సైన్యంపై పంజాబీలపై పాకిస్తాన్ లో మిగతా జాతుల తిరుగుబాటు..!

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చెప్పినట్టు.. ‘పాకిస్తాన్ పవిత్ర ముస్లిం దేశమని.. అసలు ప్రాఫిట్ మహ్మద్ స్థాపించిన ఆ నాటి ఇస్లాం రాజ్యం తర్వాత మాదే పవిత్ర ఇస్లాం దేశంగా గొప్పలు చెప్పుకున్నాడు…వాస్తవానికి అది ఇవ్వాళ చెప్పడంలో అర్థం లేదు. 1971లో బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ కోల్పోయిన తర్వాత ఇలాంటి మాటల మాట్లాడడం లో అర్థం లేదు.

జిన్నా పాకిస్తాన్ ను ఏర్పాడ్డాక ఎక్కవ కాలం పాలించలేదు. కేవలం ఏడాది పాలించి క్యాన్సర్ తో మరణించాడు. తర్వాత సైనిక పాలనలోనే పాకిస్తాన్ ఎక్కువ కాలం మగ్గింది. ఆర్మీ చేతుల్లోనే ఇప్పటికీ కొనసాగుతోంది. పాక్ ఆర్మీ చేతుల్లో లేకుంటే దేశం ముక్కలు ముక్కలు అయ్యేది. జనానికి ఆర్మీ మీద మంచి అభిప్రాయం ఉంది.

ఇవాళ పాకిస్తాన్ దేశంగా నిలబడడానికి కారణం ఆర్మీయని చెబుతారు. గతం నుంచి మిలటరీ పాలకులు ఇస్లాం మీద ఆధారపడ్డ వారు కాద. కానీ జియాహుల్ హక్ వచ్చిన తర్వాతనే ఇస్లాం భావజాలాన్ని పాకిస్తాన్ ఆర్మీలో బలంగా చొప్పించాడు..