పాకిస్తాన్ కు మరో షాక్- దిగుమతులపై నిషేధం విధించిన భారత్..

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌ను ఆర్థికంగా దెబ్బకొచ్చే చర్యలను భారత్‌ మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే అన్ని రకాల దౌత్య సంబంధాలు తెంచుకుంటోన్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో గట్టి షాకిచ్చింది. ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. పాకిస్థాన్‌ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.

‘పాకిస్థాన్‌లో ఉత్పత్తి అయ్యే లేదా ఆ దేశం నుంచి భారత్‌కు వచ్చే అన్నిరకాలా వస్తువుల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నాం. అనుమతులు ఉన్న ఉత్పత్తులైనా, స్వేచ్ఛాయుత దిగుమతులైనా పాక్‌ నుంచి ఎలాంటి వస్తువులను అనుమతి ఉండదు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ఈ నిషేధం నుంచి ఏవైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. దేశ భద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటనలో ప్రకటించింది…

భారత్ గగనతలంపై పాక్ విమానాలకు నో చెప్పింది. ఇక పాక్ సినిమాలు, యూట్యూబ్ ఛానెళ్ల ను నిషేధించింది. పాక్ ను అన్నిరకాలుగా కార్నర్ చేసింది. ఈ క్రమంలో భారత్ పాక్ కు మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఇక మీద పాక్ నుంచి అన్నిరకాల దిగుమతులపై నిషేధం విధించింది.

ఈ క్రమంలో దాయాది పాక్ తో, డైరెక్ట్, ఇన్ డైరెక్ట్ గా అన్నిరకాల గా దాయాది నుంచి అన్నిరకాల వస్తువుల దిగుమతులపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు భారత వాణిజ్య మంత్రిత్వశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భారత్ భద్రత, ప్రభుత్వ విధానాలకు సంబంధించిఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్ వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

తాజా ఉత్తర్వుల ప్రకారం.. భారత్ ఇక మీదట ఎలాంటి పాక్ ఉత్పత్తుల్ని మనదేశంలోకి రానివ్వదు. తదుపలి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. భారత్ పాక్ నడ్డివిరిచే ఏ ఒక్క చర్యల్ని కూడా వదులుకొవడం లేదు…

పాకిస్తాన్ భారతదేశానికి ఎగుమతి చేసే కీలక ఉత్పత్తులు..
♦ పాకిస్థాన్ నుంచి భారతదేశానికి ఎగుమతుల్లో సిమెంట్ అగ్రస్థానంలో ఉంది. పంజాబ్, రాజస్థాన్ వంటి ఉత్తర భారత రాష్ట్రాల్లో ఈ సిమెంట్ ను ఎక్కువగా వినియోగిస్తుంటారు.
♦ భారతదేశం వస్త్ర కేంద్రంగా ఉన్నప్పటికీ పాకిస్థాన్ నుంచి కొంత మొత్తంలో వస్త్ర ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటుంది. వీటిలో ముఖ్యంగా ముడి పత్తి, పత్తి నూలు, పట్టు వ్యర్థాలు ఉన్నాయి.
♦ పాకిస్థాన్ నుంచి వివిధ రకాల పండ్లు, ఆహార పదార్థాలు దిగుమతి అవుతుంటాయి. వాటిలో ఖర్జూరాలు, మామిడి పండ్లు ఉన్నాయి. భారత్ లో కొరత ఉన్న సందర్భాల్లో ఉల్లిపాయలు, టమోటాలు కూడా పాకిస్థాన్ నుంచి దిగుమతి అవుతుంటాయి.
♦ రాతి ఉప్పు, జిప్సం, టాన్డ్ తోలు, ఔషదాలలో ఉపయోగించే కాల్షియం కార్బోనేట్, పలు రసాయన ఉత్పత్తులను పాకిస్థాన్ నుంచి భారతదేశం దిగుమతి చేసుకుంటుంది.
♦ క్రికెట్ బ్యాట్లు, బంతులు, చేతి తొడుగులతోపాటు.. శస్త్రచికిత్సా పరికరాలు, కళ్లద్దాల లెన్సులు కూడా దిగుమతి అవుతుంటాయి.