భారత్ పక్షాన నిలుస్తామని అమెరికా స్పష్టం చేయగా, జపాన్ అదే మాట చెప్పింది. సంబంధిత పక్షాలు సంయమనం పాటించాలని బ్రిటన్ పేర్కొంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము భారత్ పక్షాన నిలబడతామని అగ్రరాజ్యం పేర్కొంది. ప్రధాని నరేంద్రమోదీకి సంపూర్ణ మద్దతు ఇస్తామని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి టామీ బ్రూస్ వెల్లడించారు. ఆమె రోజువారీ విలేకరుల భేటీలో గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ ప్రతిస్పందన సరైందే: వాన్స్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఉగ్రవాదం విషయంలో భారత్ పక్షానే స్పందించారు. ”పర్యాటకులపై ఉగ్రదాడి ఘటన దిగ్భ్రాంతికరం. దీనికి భారత్ ప్రతిస్పందించడం సరైనదే. అయితే, అది విస్తృత ప్రాంతీయ సంఘర్షణలకు దారితీయని విధంగా ఉంటుందని మేం విశ్వసిస్తున్నాం. పాకిస్థాన్ కూడా ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆశిస్తున్నాం” అని జేడీ వాన్స్ ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటంలో అమెరికా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన భరోసానిచ్చారు.
సంయమనంతో వ్యవహరించాలి: బ్రిటన్
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను చల్లబరచాల్సిన అవసరం ఉందని బ్రిటన్ పేర్కొంది. ఉగ్రవాదుల పాశవిక దాడిపై చర్చించిన హౌస్ ఆఫ్ లార్డ్స్లో సభ్యులు పార్టీలకతీతంగా ఖండించారు. ఈ క్రమంలో బ్రిటన్ విదేశీ వ్యవహారాలమంత్రి డేవిడ్ లామి భారత్, పాక్ విదేశీ వ్యవహారాల మంత్రులతో మాట్లాడారు. బ్రిటన్ విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ (ఎఫ్సీడీవో) మంత్రి లార్డ్ రే కొలిన్స్ ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ.. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అన్ని భాగస్వామ్య పక్షాలు సంయమనంతో వ్యవహరించడాన్ని తాము ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.
వెన్నుదన్నుగా నిలబడతాం: జపాన్
ఉగ్రవాదంపై పోరులో భారత్కు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని జపాన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటెటివ్స్ స్పీకర్ నుకగ ఫుకుషిరో ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించారు. భారత పర్యటను వచ్చిన ఆయన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఉగ్రవాద నిర్మూలనలో భారత్కు తమ సంఘీభావం తెలిపారు.