అణ్వస్త్ర ప్రయోగం గురించి ప్రస్తుతం మేము ఆలోచించడం లేదు…!

పాక్‌ పాలకులు భారత్‌పై అణ్వాయుధ ప్రయోగానికి ఆలోచనలు చేస్తుంటే ఆశ్చర్యం లేదు.

పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా అసీఫ్ ‘జియో న్యూస్’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, “అణ్వస్త్ర ప్రయోగం గురించి ప్రస్తుతం మేము ఆలోచించడం లేదు. కానీ ఇదేవిదంగా భారత్‌ మాపై దాడులు చేస్తూ సహనాన్ని పరీక్షిస్తుంటే, వాటిని నియంత్రించేవారు సంయమనం కోల్పోయే ప్రమాదం ఉంటుంది..
భారత్‌ మా అవకాశాలను క్రమంగా తగ్గించేసి అణ్వస్త్ర ప్రయోగం గురించి ఆలోచించేలా చేస్తోంది. అణ్వస్త్ర వ్యవస్థని నియంత్రిస్తూ, తుది నిర్ణయాలు తీసుకునే ‘నేషనల్ కమాండ్ ఆధారిటీ’ సమావేశం జరుగలేదు. కానీ జరిగినా జరుగవచ్చు.

భారత్‌ దాడులు కేవలం మా దేశానికే పరిమితమైనవిగా ప్రపంచదేశాలు భావించకూడదు. ఈ యుద్ధం కొనసాగితే అది ప్రపంచ వినాశనానికే దారి తీస్తుందని గ్రహించాలి,” అని అన్నారు…
అంటే అణ్వస్త్ర ప్రయోగిస్తామని భారత్‌తో సహా ప్రపంచ దేశాలను కూడా పాక్‌ బెదిరిస్తోందన్న మాట! కనుక ప్రపంచ దేశాలన్నీ భారత్‌పై ఒత్తిడి పెంచి యుద్ధం విరమించేలా చేయాలని సూచిస్తున్నారన్న మాట!

పాక్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులకు, పాక్‌ పాలకులకు ఆలోచనలో పెద్ద తేడా లేదని పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా అసీఫ్ మాటలే స్పష్టం చేస్తున్నాయి. ఇటువంటి విపరీత ధోరణి కలిగిన పాక్‌ పాలకులకు ఈ యుద్ధ సమయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) చాలా హడావుడిగా, చాలా ఉదారంగా ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు రుణంగా అందిస్తోంది. ఏమనుకోవాలి?..

తెర వెనక శక్తులు వేరే

పాకిస్తాన్ దేశానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వన్ బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించడాన్ని భారత్ తప్పు పడుతోంది. తాము ఉగ్రవాదంపై పోరు చేస్తుంటే శత్రు దేశానికి ఈ స్థాయిలో ఆర్థిక సహాయం చేయడం అత్యంత దారుణమని అభిప్రాయపడుతోంది.. మరోవైపు పాకిస్తాన్ దేశానికి ఈ స్థాయిలో ఆర్థిక భరోసా లభించడం వెనక తెరవెనక బలమైన శక్తులుగా ఉన్న దేశాలు కృషిచేశాయని భారత్ అనుమానిస్తోంది. ఎందుకంటే డ్రాగన్ దేశానికి ఆసియా మీద పట్టుదక్కాలంటే పాకిస్తాన్ సహకారం కచ్చితంగా కావాలి. అందువల్లే డ్రాగన్ పాకిస్తాన్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. వ్యూహాత్మకంగా రహదారులు.. ఇతర వాణిజ్య క్లస్టర్లు ఏర్పాటు చేస్తోంది. ఇక అమెరికా కూడా గతంలో తన ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించింది. పాకిస్తాన్లో వారికి షెల్టర్ కూడా ఇచ్చింది. ఎప్పుడైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేత జరిగిందో.. అప్పుడే శత్రుదేశంపై అగ్రరాజ్య ధోరణి కాస్త మారింది. లాడెన్ ను చంపిన తర్వాత అగరాజ్యం కాస్త దూరం జరిగినప్పటికీ.. తన సార్వభౌమాధికారం.. ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన శత్రుదేశానికి అగ్రరాజ్యం తెర వెనుక సహాయం చేస్తోంది. ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో దాయాది దేశానికి ఊహించని స్థాయిలో ఆర్థిక సహాయం లభించింది అంటే.. దాని వెనుక ఇతర శక్తుల పాత్ర లేదంటే నమ్మలేమని దౌత్య విభాగంలో పనిచేసిన మాజీ అధికారులు అంటున్నారు..”చైనాకు ప్రపంచ శక్తిగా ఎదగాలి అనే కోరిక ఉంది. అమెరికాకు తన నెంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే తలంపు కూడా ఉంది. భారత్ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఒకరకంగా జపాన్ దేశాన్ని పక్కన పెట్టింది. ఏకంగా మూడవ ఆర్థిక శక్తిగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇవన్నీ కూడా ఆసియాలో ఉన్న చైనాకు కంటగింపుగా ఉన్నాయి. మరోవైపు పాకిస్తాన్ తో అమెరికాకు అప్పుడప్పుడు అవసరాలు పడతాయి. అందువల్లే ఈ రెండు దేశాలు ఇలా చేశాయని” జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి….