తెలుగు చిత్రసీమలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదు
సినిమా వాళ్లెవరూ వ్యక్తిగతంగా కలవడానికి రావద్దు
కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా తెలుగు సినీ సంఘాల ప్రతినిధులు రాష్ట్రముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారా?
గత ప్రభుత్వం సినిమా రంగం వారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరిచిపోయారు, కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు.. సినిమా రంగం అభివృద్ధినే చూస్తుంది
ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు. సినీ సంఘాల ప్రతినిధులే రావాలి
సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తాను – డిప్యూటీ సీఎం పవన్
టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా థియేటర్ల వివాదంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఓ సంచలన ప్రకటన వెలువడింది. రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే.. తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్లు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏపీలో ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారా? అని ఆ సందర్భంగా ప్రశ్నించారు.
”ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదు. అందరూ కలసి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించినా సానుకూలంగా స్పందించలేదు” అని ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం సినిమా రంగంవారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరచిపోయినట్లున్నారని.. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవని.. సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు, సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందన్నారు.తెలుగు సినిమా రంగంలోని అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకొని ఇక్కట్ల పాలుజేసిందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరచిపోయినట్లున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు, సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు కూడా స్పష్టంగా చెప్పాయి.
గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది.. కక్ష సాధింపులకు దిగేది. తమకు నచ్చనివారి సినిమాల విడుదల సమయంలో థియేటర్ల దగ్గర తహసీల్దార్లను నియమించి ఎన్ని ఇబ్బందులుపెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా?’