కాంగ్రెస్ లీడర్లు పోటాపోటీగా ఫ్లెక్సీలు…ఒరిజినల్” కాంగ్రెస్ అంటూ ప్లెక్సీలు…!

జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి చెందిన లీడర్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. టీపీసీసీ ప్రచార కమిటీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ పేరుతో జగిత్యాల పట్టణంలో ప్రధాన కూడళ్ళలో “ఒరిజినల్” కాంగ్రెస్ అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు…మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు తామే అని వలస లీడర్లం కాదని అర్ధం వచ్చేలా పరోక్షంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను టార్గెట్ చేస్తూ కట్టిన ప్లెక్సీ లు కాంగ్రెస్ లో మరింత హీట్ పెంచాయి. వాస్తవానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా మారింది.

ఇక అప్పటి నుండి కొందరు లీడర్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెంట నడుస్తుండగా మరికొందరు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెంట ఉన్నారు. సంజయ్ చేరికను మొదటి నుంచి జీవన్ రెడ్డి విభేదిస్తూ రావడంతో ఈ ఇద్దరి లీడర్ల మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది. దీంతో ఈ ఇద్దరి లీడర్ల అనుచరులు సైతం మేమంటే మేమే అసలైన కాంగ్రెస్ నాయకులం అంటూ వాదిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి రావడం, అదే రోజు ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ జగిత్యాలలో కాంగ్రెస్ లీడర్లు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులు “ఒరిజినల్” ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆ పార్టీలో ఉన్న వర్గ పోరు మరోసారి బహిర్గతం చేశాయి. జగిత్యాల కాంగ్రెస్ లో ఉన్న వర్గ పోరుకు మంత్రి అడ్లూరి ఏ విధంగా చెక్ పెడతారో చూడాల్సి ఉంది… వర్గ విభేదాలు ఎప్పుడు సమసి పోతాయి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు…