తెలంగాణ ప్రభుత్వంలో కొత్తగా శాఖల కేటాయింపు…

తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు జరగబోతున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నారు…కొత్త కేబినెట్‌లోకి ముగ్గురు మంత్రులను తీసుకోవడంతో ఇంతకుముందున్న మంత్రుల శాఖలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. మరి కాసేపట్లో మంత్రుల శాఖల్లో మార్పుపై ప్రకటన వెలువడనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ తనకొద్దంటున్నట్లు తెలుస్తోంది. తనకు హోం శాఖ ఇవ్వాలని భట్టి విక్రమార్క మనసులో మట భయటపెట్టారట..

మంత్రి శ్రీధర్‌ బాబుకు ఐటీకి తోడుగా మున్సిపల్ శాఖ కేటాయించే అవకాశం ఉంది. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దగ్గర ఉన్న సివిల్ సప్లై శాఖ మరొకరికి కేటాయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త మంత్రుల్లో వాకిటి శ్రీహరికి ఫిషరీష్‌, పశు సంవర్ధక శాఖ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ సంక్షేమ శాఖ, గడ్డం వివేక్‌కు కార్మిక శాఖ, ఉపాధి, మానవ వనరుల శాఖ కేటాయించనున్నారు.

శాఖల కేటాయింపు

తెలంగాణ కేబినెట్ లో ముగ్గురు కొత్త మంత్రులతో పాటుగా మరి కొందరు శాఖల మార్పుల పైన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ఎవరికీ కేటాయించని శాఖలనే కొత్తవారికి ఇచ్చే చాన్స్‌ ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా ఎవరికీ కేటాయించని శాఖలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సీఎం వద్దే ఉన్నాయి. వాటిలో విద్య, పురపాలక, హోం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్‌, కమర్షి యల్‌ ట్యాక్స్‌, పశు సంవర్థకశాఖ, న్యాయ, కార్మిక, మైన్స్‌ అండ్‌ జియాలజీ, క్రీడలు యువజన శాఖతో పాటు మరికొన్ని శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. కాగా, కొత్త మంత్రుల్లో గడ్డం వివేక్‌కు కార్మిక, మైనింగ్‌, క్రీడల శాఖ ఇస్తారని తెలుస్తోంది. అదే విధంగా, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం ఖరారైనట్లు సమాచారం.

హైకమాండ్ తో చర్చలు

మరో మంత్రి వాకిటి శ్రీహరికి పశుసంవర్థక, యువజన, న్యాయ లేదా మత్స్య శాఖ కేటాయించే అవకాశం ఉందని సమాచారం. సీఎం రేవంత్‌ రెడ్డి తొలిదశ మంత్రివర్గ కూర్పు సమయంలో శాఖల కేటాయింపుపై హైకమాండ్‌ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని శాఖల పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ అధినాయకత్వంతో కీలక అంశాల పైన చర్చ చేయనున్నారు. పార్టీ కార్యవర్గ విస్తరణపై చర్చించనున్నట్లు తెలియవచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనికి సంబంధించి సభల తేదీలను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో మంత్రి పదవులు రాని వారి విషయం లోనూ మరోసారి రేవంత్ పార్టీ నాయకత్వంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది…