ఒక్క ‘సారీ’ పోస్ట్‌తో రాత్రికి రాత్రే మస్క్ కు రూ. 1600 కోట్ల లాభం..!.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఇటీవల బహిరంగంగా మాటల యుద్ధానికి దిగిన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గారు..అధ్యక్షుడిపై తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానంటూ పోస్ట్‌ పెట్టి సయోధ్యకు సిద్ధమయ్యారు. ఈ ఒక్క మాటతో టెస్లా అధినేత సంపద అమాంతం పెరగడం గమనార్హం. మస్క్‌ పోస్ట్ తర్వాత ఆయన నికర సంపద (Musk Net Worth) 191 మిలియన్‌ డాలర్ల మేర పెరిగింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1600 కోట్లకు పైమాటే..!

అమెరికా కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున మస్క్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘అమెరికా అధ్యక్షుడి (Donald Trump)పై పెట్టిన నా పోస్టులపై చింతిస్తున్నా. అవి చాలా దూరం వెళ్లాయి’ అని ఆయన విచారం వ్యక్తంచేశారు. ఆయన క్షమాపణలను అటు ట్రంప్‌ కూడా అంగీకరించినట్లు వైట్‌హౌస్‌ ధ్రువీకరించింది. ఈ పరిణామాలతో అమెరికా మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. దీంతో మస్క్‌ కంపెనీల షేర్లు రాణించడంతో ఆయన సంపద పెరిగింది.

మస్క్‌ ప్రైవేట్‌ ఫోన్‌ కాల్‌.. క్షమించిన ట్రంప్‌
ఫోర్బ్స్‌ గణాంకాల ప్రకారం.. ఈ ‘సారీ’ పోస్ట్‌ తర్వాత మస్క్‌ నికర సంపద 191 మిలియన్‌ డాలర్లకు పెరిగి మొత్తం ఆస్తుల విలువ 411.4 బిలియన్‌ డాలర్లకు ఎగబాకింది. బుధవారం నాటి అమెరికా మార్కెట్‌ సెషన్‌లో టెస్లా కంపెనీ షేర్ల విలువ 0.10శాతం మేర పెరిగి 326.43 డాలర్లకు చేరింది. ఇటీవల మస్క్‌-ట్రంప్‌ విభేదాల నేపథ్యంలో టెస్లా షేర్లు భారీగా కుదేలైన సంగతి తెలిసిందే. ఒక్కరోజే ఏకంగా 14శాతం మేర పతనమవడంతో.. కంపెనీ మార్కెట్‌ విలువలో దాదాపు 152 బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరైంది. ఆ తర్వాత షేర్లు కాస్త కోలుకున్నాయి.

అమెరికా ప్రభుత్వం రూపొందించిన ‘బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’ను టెస్లా అధినేత వ్యతిరేకించడంతో ట్రంప్‌నకు, ఆయనకు మధ్య దూరం పెరిగింది. ఈక్రమంలో ట్రంప్‌పై మస్క్‌ సంచలన ఆరోపణలు చేశారు. సెక్స్‌ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో ట్రంప్‌నకు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. తన మద్దతు లేకపోయి ఉంటే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్, రిపబ్లికన్‌ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని మస్క్‌ వ్యాఖ్యానించగా.. ఆయన వ్యాఖ్యలను అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. మస్క్‌ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని ట్రంప్‌ హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్‌ వెనక్కి తగ్గుతూ నిన్న పోస్ట్‌ చేశారు..