ఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో కేటీఆర్ పై విచారణ ముగిసింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు ఆయనకు చెప్పారు. ఈరోజు ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు కేటీఆర్ హాజరైన సంగతి తెలిసిందే..ఈ విచారణలో ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి అధికారులు కేటీఆర్ నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది.
దాదాపు 7 గంటల పాటు 60 ప్రశ్నలను ఏసీబీ (ACB) సంధించినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి పిలుస్తామని, విచారణకు అందుబాటులో ఉండాలని సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. విచారణ అనంతరం నేరుగా తెలంగాణ భవన్ (Telangana Bhavan) చేరుకున్న కేటీఆర్.. పార్టీ నేతలు, కార్యకర్తలతో ముచ్చటించిన తర్వాత సంచలన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విచారణలో అడిగిన ప్రశ్నలనే అటు, ఇటు తిప్పి అడిగారని అన్నారు. అలాగే తాను ఏసీబీ అధికారులను అడిగిన ప్రశ్నలకు ఎటువంటి సమాధానం లేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలనే పదే పదే అడిగారని, ఎటువంటి అవినీతి జరగలేదని కేటీఆర్ స్పష్టం చేశారు…
ఏసీబీ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. ”చట్టం మీద గౌరవం ఉంది కాబట్టే ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పాము .ఇది మూడోసారి విచారణకు పిలవటం. మూడుసార్లు కాదు 30 సార్లు అయినా విచారణకు వస్తాం. విచారణకు సహకరిస్తాం.కేసీఆర్, హరీష్ రావులను కాళేశ్వరం కమిషన్ల ముందు కూర్చోబెట్టారు. వారిని కమిషన్ ముందు కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నన్ను ఏసీబీ విచారణకు మళ్లీ మళ్లీ పిలుస్తున్నారని” కేటీఆర్ ఆరోపించారు..