హైవేలపై రాకపోకల వాహనదారులకు గుడ్ న్యూస్. ..కేవలం రూ.3వేలతో ఫాస్టాగ్ ఏడాదికి 200 ట్రిప్పులు- కేంద్రం కీలక నిర్ణయం.
హైవేలపై రాకపోకలు సాగించే వాహనదారులకు
గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా హైవే ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రూ.3వేలతో ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను తీసుకుంటే దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై నిశ్చింతగా, సాఫీగా ఏడాదంతా రాకపోకలు సాగించొచ్చు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచే వార్షిక పాస్‌ల జారీ ప్రక్రియ మొదలవుతుందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం వెల్లడించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఫాస్టాగ్ వార్షిక పాస్‌ల జారీ కోసం త్వరలోనే రాజ్‌మార్గ్ యాత్రా యాప్(Rajmarg Yatra App)తో పాటు ఎన్హెచ్ఏఐ(NHAI), ఎంఆర్టీహెచ్(MoRTH) అధికారిక వెబ్సైట్లలో ప్రత్యేకమైన లింక్ యాక్టివేట్ అవుతుందని గడ్కరీ తెలిపారు. దాని ద్వారానే ఫాస్టాగ్ వార్షిక పాస్‌ల యాక్టివేషన్, రెన్యూవల్ చేయించుకోవచ్చన్నారు.
200 వాహన ట్రిప్పులు – ఏడాది వ్యవధి
ఫాస్టాగ్ వార్షిక పాస్ అనేది యాక్టివేట్ చేసుకున్న తేదీ నుంచి ఏడాది పాటు పనిచేస్తుంది. ఈ వ్యవధిలో దేశంలోని అన్ని జాతీయ రహదారులపై గరిష్ఠంగా 200 వాహన ట్రిప్పులు ప్రయాణించొచ్చు. 200 వాహన ట్రిప్పులు, ఏడాది వ్యవధి.. ఈ రెండింటిలో ఏది ముందు వస్తే అప్పటితో ఫాస్టాగ్ వార్షిక పాస్ చెల్లుబాటు గడువు ముగుస్తుంది. ఆ తర్వాత మళ్లీ రూ.3వేల ఫీజును చెల్లించి, దాన్ని రెన్యూవల్ చేయించుకోవాలి.
నాన్ కమర్షియల్ ప్రైవేటు వాహనాల కోసమే
కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్ కమర్షియల్ ప్రైవేటు వాహనాల కోసమే ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను కేంద్ర రోడ్డు రవాణా శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది…