అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు భారత్పై కవ్వింపు చర్యలు..
సరిహద్దులతో పాటు సైబర్ దాడులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిక..
అభివృద్ధిలో అగ్రరాజ్యానికి ధీటుగా చైనాను అభివృద్ధి చేస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్. దేశాన్ని అన్నిరంగాల్లో ముందు ఉంచేందుకు శ్రమిస్తున్నారు. దీంతో ప్రస్తుతం చైనా ఆర్థికంగా ప్రపంచంలో మూడోస్థానానికి ఎగబాకింది. అయితే దేశ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చే జిన్ పింగ్.. కొన్ని రోజులు అదృశ్యమయ్యారు. ఇప్పుడు ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మే 21 నుంచి జూన్ 5 వరకూ బహిరంగంగా కనిపించకపోవడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ గైర్హాజరీ చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ)లోని అంతర్గత రాజకీయ గతిశీలతపై ఊహాగానాలకు దారితీసింది. షీ జిన్పింగ్ గతంలోనూ ఇలాంటి సందర్భాల్లో కొన్ని రోజులపాటు బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి వార్తలు మరింత తీవ్రంగా వ్యాప్తి చెందాయి. కొన్ని నిఘా సంస్థలు దీనిని సాధారణ వ్యవహారంగా పరిగణిస్తుండగా, మరికొన్ని సంస్థలు అధ్యక్ష మార్పుకు సంకేతంగా భావిస్తున్నాయి..
అంత సింపుల్ కాదు..
చైనా కమ్యూనిస్టు పార్టీలో అధినేతలను ఆకస్మికంగా పక్కనబెట్టడం లేదా వారి బహిరంగ ఉనికిని తగ్గించడం సులభంగా జరగదు. కానీ అసాధారణం ఏమీ కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో హూ జింటావో, జియాంగ్ జెమిన్ వంటి నాయకుల సమయంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఈ గైర్హాజరీలు తరచూ అంతర్గత రాజకీయ సమావేశాలు, వ్యూహాత్మక నిర్ణయాలు లేదా వ్యక్తిగత కారణాలతో ముడిపడి ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, షీ జిన్పింగ్ విషయంలో ఈ గైర్హాజరీ అధికార మార్పుకు సంకేతమా లేక సాధారణ విరామమా అనేది స్పష్టత లేని అంశం…
క్షీణిస్తున్న జిన్పింగ్ ప్రాబల్యం
నిఘా వర్గాల సమాచారం ప్రకారం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ)లో జిన్పింగ్ సిద్ధాంతపరమైన పట్టు బలహీనపడుతోంది. ఈ ఏడాది మే 21 నుంచి జూన్ 5 వరకు ఆయన ప్రజా జీవితానికి దూరంగా ఉండటం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. అయితే, చైనాలో శక్తిమంతమైన నేతల ప్రాధాన్యం తగ్గించి, కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చడం కొత్తేమీ కాదని నిఘా వర్గాలు గుర్తుచేస్తున్నాయి. గతంలోనూ ముగ్గురు కీలక నేతల విషయంలో సీసీపీ ఇదే విధానాన్ని అనుసరించిందని వారు తెలిపారు.
ప్రస్తుతం దేశంలో నిజమైన అధికారం సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) మొదటి వైస్ చైర్మన్ అయిన జనరల్ జాంగ్ యోక్సియా చేతుల్లో ఉందని తెలుస్తోంది. మాజీ అధ్యక్షుడు హు జింటావో వర్గానికి చెందిన సీనియర్ల మద్దతు జాంగ్కు పుష్కలంగా ఉంది. సైన్యం, ఆర్థిక వ్యవస్థ, పార్టీ సిద్ధాంతాలపై జిన్పింగ్ ఆధిపత్యం తగ్గుతోందని చెప్పడానికి, ఆయనకు విధేయులైన పలువురు ఆర్మీ జనరళ్లను పదవుల నుంచి తొలగించడం లేదా పక్కనపెట్టడమే నిదర్శనమని నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణలోని మీడియాలో ‘జిన్పింగ్ ఆలోచనా విధానం’ ప్రస్తావన తగ్గడం కూడా ఈ మార్పును సూచిస్తోంది.