సెల్ లో ఫోటో దిగితే చాలు- వెంటనే రేషన్ ఇచ్చేస్తారు.!?

దేశంలో కొన్ని కోట్ల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. వారు ఆయా ప్రాంతాల్లో నెల నెలా రేషన్ సరుకులు తీసుకుంటూ ఉంటారు. అందుకుగాను ప్రతిపాదిత రేషన్‌ డిపోకి వెళ్లి స్వీకరిస్తుంటారు. ఆ సమయంలో ఈ-పాస్ యంత్రం ద్వారా ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ ద్వారా బయోమెట్రిక్ పూర్తి చేస్తి సరుకులు అందుకుంటారు. అయితే ఇప్పుడు మరో టెక్నాలజీ ఫేస్ అథంటికేషన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు కూడా చేస్తోంది.

పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) కింద అర్హత కలిగిన లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయడానికి రాష్ట్రంలోని డిజిటల్ టెక్నాలజీ, గవర్నెన్స్ విభాగం (DDTG) జూలై 1 నుంచి ఆధార్ ఆధారిత ముఖ ప్రామాణీకరణ వ్యవస్థను ప్రారంభించింది. ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా రేషన్ దుకాణాల్లో వినియోగదారుల ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా వారికి రేషన్ ఇస్తున్నారు. అలా ఈ వ్యవస్థను అమలు చేసిన దేశంలో మొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది.

ఆ సమస్యలకు చెక్..!?

అయితే ఇప్పటి వరకు హిమాచల్‌ ప్రదేశ్లో అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నట్లే ఈ-పాస్ యంత్రంతో బయోమెట్రిక్ నమోదు చేసి రేషన్ పంపిణీ చేస్తున్నారు. కానీ యంత్రంలో పలు సమస్యలు ఉండడంతో ప్రజలు రేషన్ దుకాణానికి వచ్చి అనేక గంటలు వెలుపల నిలబడాల్సి వచ్చింది. దీంతో పౌరసరఫరాల, వినియోగదారుల శాఖకు నిరంతరం ఫిర్యాదులు అందుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ పాస్ యంత్రంలో ఫింగర్ ప్రింట్ బదులుగా ముఖ ప్రామాణీకరణ వ్యవస్థను అమలు చేసింది సర్కార్..

జూన్ 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫేస్ ప్రామాణీకరణ వ్యవస్థను అమలు చేసినట్లు ఆహార పౌర సరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్ రామ్ కుమార్ గౌతమ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాల వల్లనే ఇదంతా సాధ్యమైందని కొనియాడారు. హిమాచల్ ప్రదేశ్‌లో రేషన్ కార్డుదారుల సంఖ్య 19,40,968 ఉండగా, ఇప్పుడు వారంతా ఫేస్ అథెంటికేషన్ యాప్ ద్వారా డిపోల్లో రేషన్ అందుకుంటున్నారు..