పార్లమెంట్లో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి లోక్‌సభలో, మంగళవారం నుంచి రాజ్యసభలో చర్చ జరగనుంది. ఈ అంశంపై ఉభయసభల్లో చెరో 16 గంటలు కేటాయించారు. పహల్గాం ఉగ్రదాడి వెనుక నిఘా వైఫల్యం, ట్రంప్ మధ్యవర్తిత్వ వ్యాఖ్యలు వంటి అంశాల ఆధారంగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని విపక్షాలు యత్నిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో 100 శాతం లక్ష్యాలు సాధించామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక పోరులో తమ దృఢమైన వైఖరిని మరోసారి తెలియజేయనుంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలివారం బిహార్ ఓటరు జాబితా సవరణ సహా వివిధ అంశాలపై విపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం నడిచింది. సభా కార్యకలాపాలు సాగలేదు. కానీ సోమవారం నుంచి సభ సజావుగా సాగేందుకు అధికార , విపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై సోమవారం పార్లమెంట్లో చర్చ ప్రారంభం కానుంది. జాతీయ భద్రత, విదేశాంగ విధానానికి సంబంధించిన ఈ చర్చ వాడీవేడిగా సాగే అవకాశం ఉంది.
అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధం
కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్ సహా ఇతర సభ్యులు ఈ చర్చలో మాట్లాడనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వ బలమైన వైఖరిని చెప్పనున్నారు. విపక్షాల తరఫున లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ తదితరులు తమ వాణి వినిపించనున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై వివరించడానికి అమెరికా సహా ఇతర దేశాలకు భారత బృందానికి నేతృత్వంవహించిన ఎంపీ శశిథరూర్‌ను ఈ అంశంపై మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎంపిక చేస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంకాలేదు..
పహల్గాం ఉగ్రదాడికి నిఘా వైఫల్యమే కారణమని కేంద్ర ప్రభుత్వాన్ని విపక్ష పార్టీలు తప్పుపడుతూ వచ్చాయి. ఉగ్రదాడికి పాల్పడ్డవారిని ఇంకా పట్టుకోకపోవడంపై విమర్శలు గుప్పించాయి. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తన మధ్యవర్తిత్వమే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపైనా ప్రభుత్వాన్ని విపక్షాలు ఇరుకునపెట్టనున్నాయి. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా విదేశాల నుంచి భారత్‌కు మద్దతు లభించకపోవడంపై మోదీ సర్కారును రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ వచ్చారు. ఐతే యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రం ఇప్పటికే వివరణ ఇచ్చింది. కాల్పుల విరమణ నిర్ణయాన్ని భారత్, పాక్ తీసుకున్నాయని ఇతర దేశాల జోక్యం లేదని తెలిపింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా వందశాతం లక్ష్యాలు సాధించామని, భారత స్వదేశీ ఆయుధ వ్యవస్థలు సత్తా చాటాయని వివరించింది. ఈ నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్ ఉభయ సభల్లో వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది..