పహల్గాం ఉగ్రదాడిలో లష్కరే తోయిబా హస్తం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలిపారు. ఆపరేషన్ మహదేవ్ చేపట్టి అంతం చేసిన ముగ్గురు ఉగ్రవాదులు ఆ ఉగ్రసంస్థకు చెందినవారేనని స్పష్టం చేశారు. వాస్తవానికి పహల్గాం దాడి వెనుక ఉన్న ఉగ్రవాదుల తలపై కాల్చి చంపాలని ప్రజలు కోరుకున్నారని, యాదృచ్ఛికంగా ఆ ముగ్గురు ఉగ్రవాదులను మన బలగాలు తలపైనే గురిచూసి కాల్చాయని ఆయన రాజ్యసభలో చెప్పారు. మహిళలు, పిల్లల ముందు మతం అడిగి మరీ చంపేశారని, ఇంత అనాగరిక నేరం ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదని అమిత్షా అన్నారు.
కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యం
కాంగ్రెస్కు జాతీయ భద్రత కంటే రాజకీయాలే ముఖ్యమైపోయాని అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో కాంగ్రెస్ సంతృప్తి పడుతోందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లను పాకిస్థాన్కు ఇచ్చేసిందని, కానీ బీజేపీ దానిని తిరిగి భారత్లో చేరుస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే ఉగ్రవాదం వృద్ధి చెందిందని ఆయన విమర్శించారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే, ఉగ్రవాదులపై చర్య తీసుకునే బదులు పత్రాలను పంపి ఉండేదని ఆయన ఆరోపించారు.
‘హిందువులు ఎప్పటికీ ఉగ్రవాదులు కాలేరు’..
భారత్లో ఉగ్రవాదం పూర్తిగా అంతరించే దిశలో ఉందని, అది కచ్చితంగా అంతం అవుతుందని అమిత్ షా అన్నారు. హిందువులు ఎప్పటికీ ఉగ్రవాదులు కాలేరని, ఈ విషయాన్ని ప్రపంచానికి గర్వంగా ప్రకటిస్తున్నానని తెలిపారు.
మరోవైపు అమిత్ షా మాట్లాడడం ప్రారంభించగానే ప్రతిపక్ష పార్టీలు నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడాలని డిమాండ్ చేశాయి. కానీ సభాధ్యక్షులు విపక్షాల డిమాండ్ను అంగీకరించలేదు. దీంతో వారు వాకౌట్ చేశారు. అమిత్షా ప్రసంగాన్ని కొనసాగిస్తూ, కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర హోంమంత్రి చిదంబరంపై విమర్శలు గుప్పించారు.