ఇలా చేస్తే భద్రతా కారణాలు అడ్డురావా?.. నాగార్జునసాగర్ డ్యాం పై వ్యక్తిగత రూల్స్….!

నాగార్జున సాగర్ డ్యామ్ 26 క్రస్ట్ గేట్లను ఎత్తడంతో ఆ దృశ్యాలను చూడడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. జలాశయం వద్ద పర్యాటకుల తాకిడి మరింత పెరగడంతో అక్కడి భద్రతా సిబ్బంది కొంతమందిపై పక్షపాతం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రస్ట్ గేట్లను జలాశయం పైకి వెళ్లి చూడాలని చాలా మంది పర్యాటకులు ఆశపడి వెళ్లడం సర్వ సాధారణమైన విషయమే.

డ్యామ్ పైకి అనుమతి లేదని బోర్డు :
నాగార్జున సాగర్ వద్ద సిఫార్సు, పలుకుబడి కలిగి ఉండి ఫోన్ చేయిస్తే సీఆర్పీఎఫ్ సిబ్బంది, ప్రత్యేక భద్రతా బలగాలు పక్షపాతం వహించే ప్రక్రియకు తెర తీస్తున్నట్లు పర్యాటకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో భద్రతా కారణాల రీత్యా డ్యామ్ పైకి ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు అనే బోర్డు పెట్టి మరీ సీఆర్ఫీఎఫ్ సిబ్బంది ఏకంగా సిఫార్సులకు పర్మిషన్ ఇస్తుంటే నాగార్జున సాగర్ భద్రత ఏమైపోతుందని కొంతమంది పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

మంత్రులు వస్తే మీడియాకు నో పర్మిషన్ : నాగార్జున సాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే సమయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్లు వస్తే మీడియా ప్రతినిధుల వాహనాలకు కూడా అనుమతి ఇవ్వలేదు. పైగా 2 కిలో మీటర్ల నడక మార్గం ద్వారా మాత్రమే వెళ్లాలనే నిబంధన పెట్టారు. ఇది చాలా దారుణం అని పలువురు మండిపడ్డారు…

ఇలా చేస్తే భద్రతా కారణాలు అడ్డురావా? :.

నాగార్జున సాగర్ డ్యామ్ భద్రత బలగాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు అక్కడ ఎవరైనా ఉంటే వారి కుటుంబాలు, బంధువులు, మిత్ర బృందం అందరూ జలాశయం పరిసరాల్లో ఎక్కడైనా సంచరిస్తున్నారు. అదే సమయంలో భద్రతా కారణాల పేరు చెప్పి సామాన్యులను అడ్డుకుంటుండటంతో తెలిసిన వారు ఉండే ఒక లెక్క, లేకపోతే మరో లెక్క ఎందుకంటూ పర్యాటకులు సెక్యూరిటీ సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం వద్ద జరుగుతున్న సిఫార్సుల వ్యవహారంపై సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు..