వలసదారులపై కఠిన ఆంక్షలు అమలుచేస్తోన్న అమెరికా తాజాగా వీసా ఆశావహుల నెత్తిన మరో బాంబు పేల్చేందుకు సిద్ధమైంది. బిజినెస్, టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు పూచీకత్తు కింద 15వేల డాలర్ల వరకు బాండ్ చెల్లించాలని అగ్రరాజ్య విదేశాంగశాఖ ప్రతిపాదించింది. ఈమేరకు ఫెడరల్ రిజిస్ట్రీలో మంగళవారం (స్థానిక కాలమానం ప్రకారం) నోటీసులు జారీ చేయనుంది.
12 నెలల పైలట్ ప్రోగ్రామ్ కింద ఈ కొత్త నిబంధన తీసుకురానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. బీ-1 (బిజినెస్), బీ-2 (టూరిస్ట్) వీసాలపై ఈ నిబంధన తీసుకురానున్నట్లు తెలిపింది. ఫెడరల్ రిజిస్ట్రీలో అధికారి నోటీసు పెట్టిన 15 రోజుల్లోపు ఈ పైలట్ ప్రోగ్రామ్ అమల్లోకి వస్తుందని పేర్కొంది. దీని ప్రకారం బిజినెస్, టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు అమెరికా ప్రవేశం పొందాలంటే కనీసం 5వేలు, 10వేలు, లేదా 15వేల సెక్యూరిటీ బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే ఈ మొత్తాన్ని చెల్లించాలి. ఒకవేళ సదరు వీసాదారులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని, గడువు పూర్తయిన తర్వాత దేశం వీడితే ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. అలా కాకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించినా, వీసా గడువు ముగిశాక కూడా అగ్రరాజ్యంలోనే ఉన్నా ఎలాంటి రీఫండ్ చేయరు.