ఉత్తరకాశీని వణికిస్తున్న వరదలు- నలుగురు మృతి. సుమారు 35 మంది గల్లంతు..!

ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీని వరదలు ముంచెత్తాయి. ధారళి గ్రామంపై జలప్రవాహం విరుచుకుపడింది. దీనితో ఆ గ్రామంలో చాలా భాగం కొట్టుకుపోయింది. వరదల్లో చిక్కుకుని నలుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గల్లంతు అయ్యారని స్థానికులు చెబుతున్నారు. వరదల ధాటికి 20-25 హోటళ్లు, నివాసాలు కొట్టుకుపోయి ఉండొచ్చని వారు అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

జలదిగ్భందంలో గ్రామాలు ప్రజలు..

వరదల వల్ల ఇప్పటికే అనేక ఇళ్లు ధ్వంసం అయ్యాయి. చాలా మంది ప్రజలు జలదిగ్భందంలో ఉన్నారు. పరిస్థితి భయానకంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు సూచించారు. ‘ఉత్తరకాశీలోని హర్సిల్ ప్రాంతంలోని ఖీర్గఢ్లో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీనితో పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం సహా విపత్తు ప్రతిస్పందన బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయని’ పోలీసులు తెలిపారు. మరో వైపు సహాయక చర్యల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది..