భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బాదుడుపై ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పారు. తద్వారా అమెరికాను ఉద్దేశిస్తూ గట్టిగా బదులిచ్చారు. రైతుల సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. రైతులు, మత్స్యకారులు, పాడిరైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నటికీ రాజీపడబోమని తెలిపారు.
రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు వ్యక్తిగతంగా ఎంత మూల్యమైనా చెల్లించేందుకు తాను సిద్ధమేనని వ్యాఖ్యానించారు. భారత్ కూడా సిద్ధమేనని తెలిపారు. ఈ మేరకు దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ జయంతి ఉత్సవాలను పురస్కరించిన దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ట్రంప్కు కౌంటర్ ఇచ్చారు. కాగా, రష్యా చమురును కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై సుంకాలను రెట్టింపు చేశారు ట్రంప్..ఇప్పటి వరకు ఉన్న 25 శాతం సుంకాలను 50 శాతానికి పెంచుతున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించారు. అయితే అంతకుముందు ప్రకటించిన పాత 25 శాతం సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్తగా విధించిన అదనపు 25 శాత సుంకాలు ఈ నెల 27వ తేదీన నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ట్రంప్ టారిఫ్లతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై భారీగా ప్రభావం పడనుంది. ముఖ్యంగా రొయ్యలు, జంతు సంబంధ ఉత్పత్తులపై అదనపు భారం పడినుంది.
అయితే మన దేశం నుంచి దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని అగ్రరాజ్యం ఎప్పటి నుంచో భారత్కు డిమాండ్ చేస్తోంది. అలా చేస్తే దేశంలోని రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అందుకు ససేమిరా అంటోంది. రాజకీయంగా కూడా అది సున్నితమైన అంశమనే చెప్పాలి. అదే సమయంలో ఇప్పటికే రెండు దేశాల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. కానీ ఇప్పటికీ ఏకాభిప్రాయం రాలేదు. ఇప్పుడు వాటిపై ట్రంప్ సుంకాలను విధించారు. త్వరలో మరిన్ని సుంకాలను విధించనున్నట్లు మరో బాంబ్ పేల్చారు..