ప్రధాని, సీఎంలు, మంత్రుల తొలగింపు..బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటి? విపక్ష పార్టీల వాదన ఏంటి?..!.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియడానికి సరిగ్గా ఒకరోజు ముందు (ఆగస్టు 20న) లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఓ బిల్లుపై ఇప్పుడు వాడివేడి చర్చ జరుగుతోంది. అదే ‘130వ రాజ్యాంగ సవరణ బిల్లు’. లోక్‌సభ, రాజ్యసభల్లో మూడింట రెండోవంతు మెజారిటీ ఉంటేనే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తుంది. కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కారుకు ప్రస్తుతం అంతటి సంఖ్యాబలం లేదు. ఐదేళ్లకు మించి శిక్షపడే కేసులతో 30 రోజులకు మించి జైల్లో ఉండే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర/రాష్ట్ర మంత్రులను పదవి నుంచి తొలగించే వివాదాస్పద ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. పార్లమెంటులో మూడింట రెండోవంతు మెజారిటీ లేదని తెలిసి కూడా ఈ బిల్లును కేంద్రం ఇప్పుడే ఎందుకు తెరపైకి తెచ్చింది? దీని వెనుక బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటి? విపక్ష పార్టీల వాదన ఏంటి? ప్రతిపాదిత బిల్లు ముసాయిదాలోని కీలక అంశాలు ఏంటి? ఈ కథనంలో చూద్దాం.

ఏమిటీ ‘130వ రాజ్యాంగ సవరణ బిల్లు’?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 75, ఆర్టికల్ 164, ఆర్టికల్ 239ఏఏ‌లలో సవరణలు చేయడమే ‘130వ రాజ్యాంగ సవరణ బిల్లు’ ప్రధాన లక్ష్యం. ఐదేళ్లకు మించి శిక్షపడే అభియోగాలతో కూడిన కేసుల్లో నిందితుడిగా 30 రోజులకుపైగా జైలులో ఉండే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర/రాష్ట్ర మంత్రులను పదవి నుంచి తొలగించాలనే కీలక ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. అంటే ఆయా కేసుల్లో వారు దోషులుగా తేలకముందే పదవుల నుంచి తప్పించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. కేవలం ఐదేళ్లకు మించి శిక్షపడే అభియోగాలతో నమోదైన కేసులు, జైలులో 30 రోజులకుపైగా ఉండటాన్ని ప్రాతిపదికలుగా చేసుకొని ప్రధాని, సీఎంలు, మంత్రులను తొలగించొచ్చని బిల్లులో పొందుపర్చడం గమనార్హం. ఈవిధంగా పదవిని కోల్పోయే నేతలు, జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ ఆ పదవిని చేపట్టొచ్చని కూడా బిల్లులో ప్రస్తావన ఉంది.

ప్రధాని, సీఎంలు, మంత్రుల తొలగింపు- ఎందుకు?..
‘130వ రాజ్యాంగ సవరణ బిల్లు’కు సంబంధించిన లక్ష్యాలు, కారణాలను దాని ముసాయిదా బిల్లు (డ్రాఫ్ట్ బిల్)లో స్పష్టంగా ప్రస్తావించారు. ”ప్రజాప్రతినిధులను ప్రజలు ఎన్నుకుంటారు. అందుకే వారు ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి. అనుమానాలకు తావు ఇవ్వకుండా ప్రజాప్రతినిధుల ప్రవర్తనా విధానం, నడవడిక, వ్యవహార శైలి ఉండాలి” అని ముసాయిదా బిల్లులో పొందుపరిచారు. ”పీఎం, సీఎంలు, మంత్రుల్లో ఎవరైనా తీవ్ర నేర అభియోగాలతో అరెస్టై జైలుపాలైతే, వారు రాజ్యాంగ నైతికతకు, సుపరిపాలన సూత్రాలకు విరుద్ధంగా నడుచుకున్నట్టు. ప్రజలు పెట్టుకున్న రాజ్యాంగబద్ధమైన విశ్వాసాన్ని ఆ నేత వమ్ము చేసినట్టు” అని ఈ బిల్లు చెబుతోంది. తీవ్ర నేర అభియోగాలతో కూడిన కేసుల్లో అరెస్టై జైలులో ఉండే మంత్రులను తొలగించేందుకు ప్రస్తుతానికి భారత రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేదనే అంశాన్ని ఈ బిల్లు గుర్తుచేస్తోంది.

ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తుందా?
‘130వ రాజ్యాంగ సవరణ బిల్లు’కు పార్లమెంటు ఆమోదం లభించడం ప్రస్తుతానికైతే అంత సులభం కాదు. ఎందుకంటే లోక్‌సభ, రాజ్యసభల్లో ఎన్‌డీఏ కూటమికి మూడింట రెండోవంతు మెజారిటీ లేదు. లోక్‌సభలోని మొత్తం ఎంపీల సంఖ్య 542. ఇందులో మూడింట రెండోవంతు మెజారిటీతో బిల్లుకు ఆమోదాన్ని పొందాలంటే 361 మంది ఎంపీల మద్దతు అవసరం. కానీ అధికార ఎన్‌డీఏ కూటమికి లోక్‌సభలో 293 మంది ఎంపీలే ఉన్నారు. రాజ్యసభలోని మొత్తం ఎంపీల సంఖ్య 239. ఇందులో మూడింట రెండోవంతు మెజారిటీతో బిల్లుకు ఆమోదాన్ని పొందాలంటే 160 మంది ఎంపీల మద్దతు అవసరం. కానీ ఎన్‌డీఏకు రాజ్యసభలో 132 మంది ఎంపీలే ఉన్నారు. ఈ రెండు సభల్లోనూ కొన్ని విపక్ష పార్టీల ఎంపీలు ఎన్‌డీఏకు అనుకూలంగా ఓట్లు వేసినా, ఈ బిల్లు పాస్ కావడం అనేది దాదాపు అసాధ్యమే. ఒకవేళ అనూహ్యంగా ఈ బిల్లు పార్లమెంటులో పాసైతే, తదుపరిగా దీన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. ఈ బిల్లులోని అంశాలు భారతదేశ సమాఖ్య వ్యవస్థకు, రాష్ట్రాలకు సంబంధించినవి. అందుకే దీనికి దేశంలోని కనీసం సగం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆమోదాన్ని పొందాల్సి రావచ్చు. దీన్ని ఈజీగానే బీజేపీ గట్టెక్కుతుంది. ఎందుకంటే మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీయే అధికార పీఠంపై ఉంది. ఇదంతా జరిగిపోయినా, చివరకు ఈ బిల్లును సుప్రీంకోర్టులో ఎవరైనా సవాల్ చేసే అవకాశం ఉంది. ”దోషిగా నిర్ధారణ అయ్యే వరకు నిందితుడు అమాయకుడే” అనే అంశాన్ని ప్రస్తావిస్తూ, మంత్రులు, సీఎంలను దోషులుగా తేలకముందే పదవుల నుంచి తప్పించడం సరికాదని పిటిషనర్లు సుప్రీంకోర్టులో వాదనలు లేవనెత్తే ఛాన్స్ ఉంది..