ఎల్‌వోసీ వెంట పాక్ డ్రోన్లు కలకలం..!

కాల్పుల విరమణ తరువాత భారత సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎల్‌వోసీ (LOC) వెంట పాక్ డ్రోన్లు కలకలం సృష్టించాయి. బాలాకోట్, లంగోట్‌తో పాటు గురుసాయి నాలా ప్రాంతంలో డ్రోన్ కదలికలను బీఎస్ఎఫ్ గుర్తించింది..సోమవారం రాత్రి సరిహద్దు అవతలి నుంచి మొత్తం ఆరు డ్రోన్లు (Drones) సరిహద్దులో గాల్లో ఐదు నిమిషాల పాటు చక్కర్లు కొట్టి పాక్ భూభాగంలోకి వెళ్లాయని ఆర్మీ ఉన్నతాధికారులు ధృవీకరించారు. దీంతో భద్రతా బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ వదిలి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని.. డ్రోన్ల కదలికను గుర్తించిన అన్ని ప్రాంతాల్లో సోమవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని ఆర్మీ వెల్లడించింది.

కాగా, కొన్నేళ్లుగా జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్‌ (Pakistan) డ్రోన్లు పలు ఆయుధాలు, మాదకద్రవ్యాలను జారవిడుస్తుండడం పెద్ద సమస్యగా మారిందని అధికారులు పేర్కొన్నారు. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు చొరబడకుండా ఉండేందుకు సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) అనంతరం పాక్‌ చేసే డ్రోన్‌ దాడులను తిప్పికొట్టేందుకు పటిష్ఠమైన చర్యల్లో భాగంగా బీఎస్‌ఎఫ్‌ (BSF) అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్‌ స్క్వాడ్రన్‌ను ఏర్పాటు చేశారు.