యూరియా కొరతపై ప్రభుత్వం స్పందించి, ఎప్పటిలోగా పంపిణీ చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్.
.
వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెరుపు ధర్నా చేశారు. యూరియా కొరతపై ప్రభుత్వం స్పందించి, ఎప్పటిలోగా పంపిణీ చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు..శాసనసభ వాయిదా అనంతరం నేరుగా వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి బీఆర్ఎస్ నేతలు పాదయాత్రగా వెళ్లారు. యూరియా కొరతపై వ్యవసాయ శాఖ కమిషనర్కు వినతిపత్రం అందించారు. అనంతరం కార్యాలయం బయటకు వచ్చి.. అక్కడే నిరసనకు దిగారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఇక్కడ్నుంచి కదలబోమని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఇక కమిషనర్కు వినతిపత్రం సమర్పించే సమయంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు.
ఏ రాష్ట్రాల్లోనూ యూరియా సమస్య లేదు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత. కరోనా సమయంలోనూ ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేశాం. బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు నెపం వేసుకుని తప్పించుకుంటున్నారు. యూరియా పంపిణీ చేతగాకపోతే తప్పుకోవాలి. యూరియా ఎప్పటిలోపు పంపిణీ చేస్తారో చెప్పకపోతే ఇక్కడ నుంచి కదలం. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ తీసుకొని చెబితేనే ఇక్కడ్నుంచి బయటకు వెళ్తాం. మేం రాజకీయాల కోసం రాలేదు.. రైతుల కోసం వచ్చాం…
పండుగపూట కూడా రైతన్నలను రోడ్లపైన నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. గణపతి బొప్ప మోరియా.. కావాలయ్యా యూరియా అంటూ నినాదాలు చేశారు. వ్యవసాయ మంత్రి రాజీనామా చేయాలి.. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి అంటూ నినాదాలు చేశారు. రైతన్నలకు యూరియా వెంటనే సరఫరా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్షకాల సమావేశాలు నాలుగు రోజులు పెట్టి చేతులు దులుపుకోవడం కాదు. పదిహేను రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. ప్రజా సమస్యలపై చర్చించాలని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీని దూషించడం కోసం అసెంబ్లీ సమావేశాలు కాదు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. కాళేశ్వరం కమిషన్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోషన్ కమిషన్ కాదు.. పీసీసీ కమిషన్ అంటూ ఎద్దేవా చేశారు.
ఎరువుల కొరత విషయంలో వాయిదా తీర్మానాలు ఇస్తాం. ఈ ప్రభుత్వం రచ్చ చేసే ప్రభుత్వం తప్పా.. చర్చ చేసే ప్రభుత్వం కాదు. కేసీఆర్ హయాంలో దేశంలో తెలంగాణ నెంబర్ గా ఉంది. కానీ, ఇప్పుడు తెలంగాణలో రైతులు యూరియా కోసం రోడ్లెక్కుతున్న పరిస్థితి నెలకొంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామని కేటీఆర్ అన్నారు..