మోదీ-పుతిన్‌ ద్వైపాక్షిక భేటీకి కొన్ని నిమిషాల ముందు అమెరికా ట్రంప్‌ కార్యవర్గం మెల్లగా స్వరం మార్చింది…!

షాంఘై సహకార సదస్సు (SCO) వేళ భౌగోళిక రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకు భారత్‌ (India)పై నోటికి వచ్చిన విమర్శలు చేసిన ట్రంప్‌ కార్యవర్గం మెల్లగా స్వరం మార్చింది…మోదీ-పుతిన్‌ ద్వైపాక్షిక భేటీకి కొన్ని నిమిషాల ముందు అమెరికా (USA) విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా భారత్‌-అమెరికా సంబంధాలను కొనియాడారు. వీటిని మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకొంటున్నట్లు ప్రకటించారు.

”భారత్‌-అమెరికా (India-USA) సంబంధాలు సరికొత్త శిఖరాలను అందుకొంటున్నాయి. 21వ శతాబ్ధంలోనే ఓ అర్ధవంతమైన సమగ్ర బంధం. ఈ నెలలో మా మిత్రత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అంశాలపై దృష్టిపెడుతున్నాం. వీటిల్లో సృజనాత్మకత, వ్యాపారం నుంచి రక్షణ, ద్వైపాక్షిక అంశాలు ఉండనున్నాయి. ఇరుదేశాల ప్రజల మధ్య నెలకొన్న స్నేహమే మా సహకారానికి పునాదులుగా నిలిచి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అంతేకాదు మా ఆర్థికబంధంలోని అద్భుతమైన అవకాశాలను మేము గుర్తించాము” అని మార్కో రూబియో పేర్కొన్నారు.

యురేషియాలోని కీలక శక్తులైన భారత్‌ (India), చైనా(China), రష్యా (Russia) ఒకే వేదికపై నిలిచిన వేళ మార్కో రూబియో కామెంట్స్‌ వెలువడటం గమనార్హం. ఈ వ్యాఖ్యలకు కొన్ని గంటల ముందే ట్రంప్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో నోటికి వచ్చినట్లు భారత్‌పై మాట్లాడారు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని న్యూదిల్లీనే చేస్తోందన్నారు.

మరోవైపు ఇప్పటికే ట్రంప్‌ విధించిన సుంకాలు (US Tariffs) చాలావరకు చట్ట విరుద్ధమని అమెరికా ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. అధ్యక్షుడు ట్రంప్‌ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్‌లను పెంచినట్లు పేర్కొంది. 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించారు. ఈ క్రమంలో రూబియో ప్రకటన నష్ట నివారణ చర్యల్లో భాగంగా చేశారా అన్న కోణంలో విశ్లేషకులు భావిస్తున్నారు.

నరం లేని నవారో నాలుక.. భారత్‌పై మళ్లీ ప్రేలాపనలు..!

భౌగోళిక రాజకీయాల్లో తింజియాన్‌ ఎస్‌సీవో సదస్సు అమెరికా దుందుడుకుతనానికి పెద్ద కుదుపులా మారింది. ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో ప్రపంచంలో మూడు బలమైన శక్తులు తమ మధ్య విభేదాలను వదిలి ఓకే వేదికపైకి వచ్చాయి.