యూరియా రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్‌ కార్యాలయాల వద్ద పెద్దఎత్తున బారులుతీరిన రైతులు..!

యూరియా లేకుంటే పంటలు సాగు చేసేదెలా..? ఎన్ని రోజులు పడిగాపులు కాయాలి..? ఇక మాకు చావే దిక్కు’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్‌ కార్యాలయాల వద్ద పెద్దఎత్తున బారులుతీరిన రైతులు… పంటలను కాపాడుకోవాలనే ఆరాటంతో యూరియా కోసం ఆశగా ఎదురుచూశారు. లైన్‌లో నిలబడ్డ పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. భారీగా తరలివచ్చిన రైతుల మధ్య తోపులాట జరగడంతో పలువురు గాయపడ్డారు. ఒక్క బస్తా దొరికినా పంటను కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో రైతులంతా పీఏసీఎస్‌ల వద్దనే కనిపిస్తున్నారు..
యూరియా ఇవ్వకపోవడంతో సర్కారుపై కన్నెర్ర చేశారు. గంటల తరబడి క్యూలో నిల్చున్నా ఒక్క బస్తా కూడా దక్కని రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న అధికారులు, యూరియా ఎప్పుడు ఇస్తారో కచ్చితంగా చెప్పలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే ఆలస్యమైందని, ఇకనైనా యూరియా చల్లకపోతే పంటలు తీవ్రంగా దెబ్బతింటాయని వాపోయారు. కాంగ్రెస్‌ సర్కారు అలసత్వంతో యూరియా కొరత ఏర్పడిందని మండిపడుతున్నారు. అరకొరగా వచ్చిన యూరియాను కూడా కొందరు రాత్రికిరాత్రే బ్లాక్‌ మారెట్‌కు తరలిస్తున్నారని నిప్పులు చెరిగారు..

మహబూబాబాద్‌ జిల్లా గూడూరు పీఏసీఎస్‌ వద్దకు యూరియా కోసం రైతులు భారీగా తరలివచ్చారు. వందలాది మంది బారులు తీరిన క్యూలైన్‌తో అక్కడి వాతావరణం జాతరను తలపించింది. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి లైన్‌లో నిల్చున్న కొందరు రైతులకు సాయంత్రం 4గంటల వరకు ఒక్కొక్క బస్తా చొప్పున లభించింది. మిగిలిన వారు ఆవేదనతో వెనుదిరిగారు. సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ సర్కారు నిర్లక్ష్యంతో పంటలు నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు..