నేపాల్లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు సాగుతోంది. అయితే తాత్కాలిక పాలనాధిపతిగా ఎవరుండాలనే అంశంపై తర్జనభర్జన కొనసాగుతోంది. ఈ మేరకు ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో సైన్యం, అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, ఆందోళనకారుల మధ్య చర్చలు జరిగాయి. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మాజీ సీజేఐ సుశీల కర్కి, కాఠ్మాండూ మేయర్ బాలేంద్ర షా, నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మాజీ CEO కుల్మన్ ఘీసింగ్, ధరన్ మేయర్ హర్కా సంపంగ్ పేర్లు వినిపిస్తున్నాయి. అధ్యక్షుడితో జరిగిన చర్చల్లో తాత్కాలిక ప్రధానిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి పేరును జెన్ జెడ్ గ్రూపు ప్రతినిధులు ప్రతిపాదించారు. ఆమె ఆరు నెలల్లో కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని షరతు పెట్టారు.
అయితే, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని తాము కోరడం లేదని పార్లమెంట్ను మాత్రమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు భేటీ అనంతరం జెన్ జెడ్ గ్రూపు ప్రతినిధులు వెల్లడించారు. ప్రధాని రేసులో ఉన్న కాఠ్మాండూ మేయర్ బాలెన్ షా కూడా కర్కికే మద్దతు ఇచ్చారు. ఈ మేరకు నిరసనకారులంతా దయచేసి ఓపిక పట్టాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆ తర్వాత కొత్తగా ఎన్నికలు కూడా జరుగుతాయన్నారు. జెన్ జెడ్ ప్రతినిథులంతా ప్రశాంతంగా ఉండాలని నేపాల్ అధ్యక్షుడు పౌడెల్ ఒక ప్రకటనలో కోరారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు..