తెలంగాణ ప్రభుత్వంతో విద్యా సంస్థల చర్చలు సఫలం..!

తెలంగాణ ప్రభుత్వంతో విద్యా సంస్థల చర్చలు సఫలం

ఈ వారంలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.600 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్న ప్రభుత్వం

బంద్ విరమించుకున్న ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు

మిగిలిన రూ.600 కోట్లు దీపావళికి ఇస్తామని అంగీకరించిన మంత్రులు…

రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలల బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుల విషయంలో (government) ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఆదివారం ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు , సీఎస్ రామకృష్ణ రావు, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కార్యదర్శలు, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ ప్రైవేటు కళాశాలల సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుందన్నారు. ఈ చర్చలు సానుకూలంగా కొనసాగాయని, ఆదివారం కాబట్టి, సోమవారం ప్రభుత్వపరంగా ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పటివరకు సమ్మెను విరమించమని యాజమాన్యాలను కోరగా, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు…

చర్చలు – సమస్యలు:

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం డిమాండ్ చేస్తున్న ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం శనివారం చర్చలు జరిపింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో ఫతి చైర్మన్ రమేష్ బాబు, సెక్రటరీ జనరల్ రవికుమార్, ట్రెజరర్ కృష్ణారావు తదితరులు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఫతి ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించింది.