ఆసియాకప్‌లో భారత్, శ్రీలంక సూపర్-4 పోరు అభిమానులను కట్టిపడేసింది. టీ20 మజాను అందిస్తూ ఆఖరి వరకు గెలుపు దోబూచులాడిన పోరులో టీమ్ఇండియాదే పైచేయి అయ్యింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు(202/5) సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు జరిగిన సూపర్ ఓవర్లో భారత్..అద్భుత విజయం సాధించింది. మొదట లంక నాలుగు బంతుల్లో రెండు వికెట్లు(కుశాల్, శనక)కోల్పోయిన రెండు పరుగులే చేసింది. ఛేదనలో టీమ్ఇండియా తొలి బంతికే విజయాన్నందుకుంది. అంతకుముందు భారత్ 20 ఓవర్లలో 202/5 స్కోరు చేసింది….ఓపెనర్ అభిషేక్‌శర్మ(31 బంతుల్లో 61, 8ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు తిలక్‌వర్మ(49 నాటౌట్), శాంసన్(39) రాణించారు. అసలంక, శనక ఒక్కో వికెట్ తీశారు. లక్ష్యఛేదనలో లంక 20 ఓవర్లలో 202/5 స్కోరు దగ్గర ఆగిపోయింది. ఓపెనర్ పతుమ్ నిస్సనక(58 బంతుల్లో 107, 7ఫోర్లు, 6 సిక్స్‌లు) ధనాధన్ సెంచరీతో దుమ్మురేపాడు. నిస్సనకకు తోడు కుశాల్ పెరెరా(58) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. హార్దిక్, అర్ష్‌దీప్, కుల్దీప్, రానా ఒక్కో వికెట్ తీశారు..
నిస్సనక, పెరెరా దంచుడు
లక్ష్యఛేదనలో లంకకు ఓపెనర్ కుశాల్ మెండిస్(0) రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత పతుమ్ నిస్సనక, కుశాల్ పెరెరా ఇన్నింగ్స్ నిర్మించారు. రానా మూడో ఓవర్లో నిస్సనక, పెరెరా చెరో బౌండరీతో దంచుడుకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత అర్ష్‌దీప్‌ను నిస్సనక ఓ ఫోర్, సిక్స్‌తో అరుసుకోగా, ఈసారి తన వంతూ అంటూ పెరెరా కూడా చెలరేగడంతో పవర్ ప్లే పూర్తయ్యే సరికి లంక 72/1 స్కోరు చేసింది. వీరిద్దరిని విడదీసేందుకు కెప్టెన్ సూర్య ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది.
T20 Asia Cup.
ఈ క్రమంలో 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న నిస్సనక ఏ దశలోనూ వెనుకకు తగ్గలేదు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని వరుణ్ 13వ ఓవర్లో విడదీయడంతో రెండో వికెట్‌కు 127 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. నిస్సనక 52 బంతుల్లో టీ20ల్లో తొలి సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. రానా వేసిన చివరి ఓవర్లో 12 పరుగులు అవసరమైన దశలో వికెట్ కోల్పోయి 11 రన్స్‌కు పరిమితమైంది.
స్కోర్లు బోర్డు..
భారత్: 20 ఓవర్లలో 202/5(అభిషేక్ 61, తిలక్ 49 నాటౌట్, అసలంక 1/18, శనక 1/23),..
శ్రీలంక: 20 ఓవర్లలో 202/5(నిస్సనక 107, కుశాల్ పెరెరా 58, హార్దిక్ 1/7, కుల్దీప్ 1/31)